logo

అనిశా వలలో నీటిపారుదల శాఖ ఏఈ

గ్రామీణ నీటిపారుదల శాఖలో (ఆర్‌డబ్ల్యూఎస్‌) పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) శివరామకృష్ణను శుక్రవారం గుంటూరు అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు

Published : 02 Mar 2024 05:26 IST

రూ.1.68 లక్షలు తీసుకుంటూ చిక్కి..నగదుతో పట్టుబడిన శివరామకృష్ణ
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గ్రామీణ నీటిపారుదల శాఖలో (ఆర్‌డబ్ల్యూఎస్‌) పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) శివరామకృష్ణను శుక్రవారం గుంటూరు అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనిశా ఏఎస్పీ మహేంద్ర మత్తె తెలిపిన వివరాల మేరకు.. గుంటూరులోని నల్లపాడుకు చెందిన గుత్తేదారు రవికిషోర్‌రెడ్డి పెదకాకానిలో వాకింగ్‌ ట్రాక్‌, నీళ్ల ట్యాంక్‌, చెరువు చుట్టూ అభివృద్ధి పనులు చేశారు. అందుకు సంబంధించిన బిల్లులు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, శాఖాపరమైన ఆమోదాలు తీసుకొని చెల్లించేందుకు పెదకాకాని మండల ఏఈ శివరామకృష్ణ లంచం డిమాండ్‌ చేశారు. బిల్లు మొత్తం రూ.42 లక్షల్లో నాలుగు శాతం రూ.1.68 లక్షలు లంచం ఇవ్వాలని కోరారు. వెంటనే గుత్తేదారు రవికిషోర్‌రెడ్డి గురువారం అవినీతినిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన విధంగా గుత్తేదారు శుక్రవారం రాత్రి ఆ నగదు తీసుకోవడానికి గుంటూరులోని జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ కార్యాలయం వద్దకు రావాలని ఏఈకి కబురుపెట్టారు. అప్పటికే అక్కడ అనిశా ఏఎస్పీ మహేంద్ర మత్తే, డీఎస్పీలు సత్యానందం, ప్రతాఫ్‌కుమార్‌, సీఐలు సురేష్‌, రవిబాబు, నాగరాజు, అంజిబాబు, మన్మథరావు, నర్సింహారెడ్డి తమ సిబ్బందితో మాటువేశారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగా రవికిషోర్‌రెడ్డి నుంచి శివరామకృష్ణ రూ.1.68 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అనిశా ఏఎస్పీ తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు