logo

పెత్తందారులకే దారులా..పేదలంటే అలుసా?

మంగళగిరి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో శుక్రవారం ఉదయం బాప్టిస్టుపేటకు వెళ్లిన గంజి చిరంజీవిని స్థానికులు నిలదీశారు. గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించిన సందర్భంగా స్థానికులు సమస్యలపై ప్రశ్నించారు.

Published : 02 Mar 2024 05:28 IST

బాప్టిస్టుపేటలో గంజికి చేదు అనుభవం

 ఆర్కే డౌన్‌.. డౌన్‌ అంటూ దళితుల నినాదాలు

 

చిరంజీవిని నిలదీస్తున్న స్థానికులు

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో శుక్రవారం ఉదయం బాప్టిస్టుపేటకు వెళ్లిన గంజి చిరంజీవిని స్థానికులు నిలదీశారు. గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించిన సందర్భంగా స్థానికులు సమస్యలపై ప్రశ్నించారు. ‘తమపేటలో పైపులైన్ల పేరుతో రోడ్లు పగలగొట్టి రెండేళ్లవుతోంది. ఇంతవరకు వాటిని పునరుద్ధరించలేదని’ నిలదీశారు. పెత్తందారులంటే ఎవరు? పేదవాళ్లంటే ఎవరు? పేదవాళ్లకు మీరు ఏమి న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. పెత్తందారులైన మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డువేశారు. పేదవాళ్లైన దళితుల ఇళ్ల ముందు రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చిరంజీవి నవరత్న పథకాలు ఉన్నాయి కదా అని సమాధానమిచ్చే సందర్భంలో పక్కనే ఉన్న మరొకరు అవి పక్కన పెట్టి మాపల్లెకు ఏమి చేశారంటూ నిలదీశారు. పథకాలంటున్నారు..ఎంతమందికిచ్చారంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా ప్రశ్నించే వారిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులు దళిత ద్రోహి ఆర్కే రాలేదా? మా పెద్దలను మోసం చేసి స్థలం తీసుకుని సామాజిక భవనం కడతానన్నారు. సగంలో నిలిపివేశారన్నారు. 46 గ్రామాల్లో దళితులపై ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. పార్టీలకు సంబంధం లేకుండా దళితులుగా తాము మాట్లాడుతున్నామన్నారు. కాలనీలో నీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. దానికి పరిష్కారమేదైనా చెప్పగలుగుతారా? అంటూ నిలదీశారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ గతంలో ఎందుకు చేయలేదని నన్ను అడగవద్దు.. ఇప్పుడు నేను చేస్తానని చెబుతున్నానంటూ ఇచ్చిన సమాధానానికి వారు సంతృప్తి చెందలేదు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నా..15వ వార్డులోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
చేతి వృత్తి పనికి కేటాయించిన కబేళా స్థలంలో సబ్‌స్టేషన్‌కు 25 సెంట్లు స్థలాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రయివేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. దళితులను విభజించే వైకాపాకు చరమగీతం పాడాలని కోరారు.  2024లో దళితులంతా తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు. అనంతరం దళితవాడకు సామాజిక భవనం వెంటనే నిర్మించాలని, దళితులపై వైకాపా నిర్లక్ష్యం విడనాడాలని, దళిత ద్రోహి ఆర్కే డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు