logo

అలా ఇచ్చారు.. ఇలా మార్చారు..

రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్తలను జగన్‌  మరోసారి మార్చారు. తాజాగా మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు.

Published : 02 Mar 2024 05:31 IST

మంగళగిరి ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్య

చిరంజీవికి శరాఘాతం

లావణ్య

ఈనాడు-అమరావతి: రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్తలను జగన్‌  మరోసారి మార్చారు. తాజాగా మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు. ఆమె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, అలాగే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు కావడం గమనార్హం. గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జిగా ప్రకటించి మూడు నెలలు కాకముందే లావణ్యను తెర పైకి తెచ్చారు. సిటింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి జగన్‌ అవకాశం ఇచ్చారు. ఆళ్ల వైకాపాను వదిలి కాంగ్రెస్‌లో చేరడం, మళ్లీ కొద్దిరోజుల్లోనే వైకాపాలోకి తిరుగుటపా కట్టడం చకచకా జరిగిపోయాయి. ఆళ్లరామకృష్ణారెడ్డి పునరాగమనం తర్వాత అక్కడ అభ్యర్థి మారుతారన్న ప్రచారం జోరుగా జరిగింది. గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమల పేరు పరిశీలనకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఆమె కుమార్తె లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు.

 తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నందున అక్కడ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైకాపా బలమైన అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరికి సీటు ఇస్తే ఎలా ఉంటుందోనని తర్జనభర్జన పడుతున్నారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు మూడు నెలల్లో ఇద్దరిని మార్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత గంజి చిరంజీవి ప్రాభవం తగ్గింది. అప్పుడే గంజి చిరంజీవిని తప్పిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కూడా మంగళగిరికి ఇన్‌ఛార్జి ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చారు. అప్పుడే చిరంజీవి స్థానంలో మరొకరి పేరు ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే శుక్రవారం సాయంత్రం లావణ్య పేరును ప్రకటించారు. గంజి చిరంజీవిని ఆహ్వానించకుండా మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంవోకు పిలిపించారు. వారు సీఎం కలిసిన కాసేపటికే మంగళగిరికి లావణ్యను సమన్వయకర్తగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. కాండ్రు కమల, మురుగుడు కుటుంబ సభ్యులు సీఎం కలిసిన తర్వాత గంజి చిరంజీవికి సీఎంవో నుంచి పిలుపువచ్చింది. గంజి చిరంజీవి సీఎంను కలిసివచ్చిన తర్వాత ఫోన్‌కు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం. ప్రస్తుత పరిణామం రాజకీయంగా ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో వేచిచూడాల్సిందే.

గంజికి మొండిచేయి.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో డిసెంబరులో గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుంచి తనదే సీటు అని గంజి నమ్మకంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఈసారి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 2014లో గంజి చిరంజీవి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ అతనికి మంగళగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది. ఇక్కడి నుంచి 2019లో పోటీ చేయాలని ఆశించారు. అయితే తెదేపా యువనేత లోకేశ్‌ మంగళగిరి నుంచి పోటీకి దిగడంతో ఆయనకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు గంజి చిరంజీవి ఆ పార్టీలో చేరిపోయారు. అతనిని వైకాపా ప్రభుత్వం ఆప్కో ఛైర్మన్‌గా నియమించింది. రెండు నెలల కిందట సమన్వయకర్తగా నియమించింది. ఇటీవల జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రలో కూడా నేతలు గంజి చిరంజీవిని గెలిపించాలని కోరారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలోనూ మంగళగిరి పట్టణంలో గుడ్‌ మార్నింగ్‌ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. మంగళగిరి అభ్యర్థి అని ప్రచార రథం కూడా తయారు చేసుకున్నారు. అంతలోనే గంజిని తప్పించి లావణ్యను సమన్వయకర్తగా నియమించడంతో మరోసారి గంజికి మొండిచేయి మిగిలింది. కొన్నాళ్లుగా తనతోపాటు కుటుంబ సభ్యులందరూ క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి కష్టపడగా తాజా పరిణామాలకు వారిని నిరాశకు గురిచేశాయి. వరుసగా అభ్యర్థులను మారుస్తుండడంతో వైకాపా కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఒకవైపు తెదేపా వివిధ కార్యక్రమాలతో నిత్యం జనంలో ఉంటుండగా వైకాపా అభ్యర్థుల మార్పుతో గందరగోళం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని