logo

నత్తే నయం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులు, గ్రామాల నుంచి ప్రధాన మార్గాలకు కలిపే రోడ్ల విస్తరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.

Updated : 02 Mar 2024 06:42 IST

అటకెక్కిన అనుసంధాన రోడ్ల విస్తరణ

బిల్లులు రాక పనులు నిలిపేసిన గుత్తేదారు

చేబ్రోలు నుంచి వట్టిచెరుకూరు వెళ్లే రోడ్డు అధ్వానంగా...

ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులు, గ్రామాల నుంచి ప్రధాన మార్గాలకు కలిపే రోడ్ల విస్తరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు సమర్పించినా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగకపోవడంతో నెమ్మదిగా చేస్తూ వచ్చారు. పలుమార్లు బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొంత చెల్లించి బకాయిలు ఎక్కువ పెట్టడంతో గుత్తేదారు పనులు పూర్తిగా ఆపేశారు. ప్రభుత్వం ఎప్పుడు బకాయిలు చెల్లిస్తుందో ఎప్పటికి పనులు పూర్తవుతాయో సంబంధిత ఇంజినీర్లే చెప్పలేని దుస్థితి.

ఆయా మార్గాలు విస్తరించి అభివృద్ధి చేయడానికి న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 13 రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అన్ని పనులను ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచారు. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. 13 రోడ్ల అభివృద్ధికి రూ.121.68 కోట్లతో మార్చి 2021లో ఒప్పందం చేసుకుంది. రహదారులు, భవనాల శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పనులను మార్చి 2023 నాటికి పూర్తి చేయాలి. అయితే కరోనా వల్ల కొన్ని నెలలు పనిచేయలేకపోయామని గడువు పెంచాలని గుత్తేదారు కోరారు. 9 నెలలు గడువు పెంచి డిసెంబరు 2023 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. ఇప్పటికీ కొన్ని పనులు ప్రారంభమే కాకపోగా మరికొన్ని సగం చేసి అర్ధంతరంగా ఆపేశారు. మూడు రోడ్డు పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు.  

అర్ధంతరంగా ఆపేయడంతో ఇబ్బందులు

మండలకేంద్రాలు, ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే కీలకమైన రహదారుల పనులు చేపట్టి అర్ధంతరంగా ఆపేయడంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రోడ్డు విస్తరణలో భాగంగా కొంత పనిచేసి వదిలేయడంతో అటుగా వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైలెవల్‌ వంతెనలు, పైపు కల్వర్టుల నిర్మాణం అర్ధంతరంగా ఆపేయడంతో వాటి నాణ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2021 ధరల ప్రకారం పనులు దక్కించుకున్న గుత్తేదారు రెండున్నరేళ్లు పూర్తయినా పనులు చేయకుండా మధ్యలో వదిలేయడంతో వాటిని పూర్తిచేయడమెలా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో పూర్తిచేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి. ఇప్పటికే ఆయా మార్గాలకు టెండర్లు ఖరారు అయినందున తాత్కాలిక మరమ్మతులు చేయడానికి కూడా వీల్లేదు. దీంతో అత్యంత అధ్వానంగా భారీ గోతులు పడినా, రోడ్లకు రంధ్రాలు పడినా మొక్కలు పెట్టి అటువైపు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు సూచించే నిస్సహాయస్థితిలో యంత్రాగం ఉంది. మిగ్‌జాం తుపాను ధాటికి రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి. ప్రభుత్వం పట్టించకోకపోవడంతో ప్రమాదాల బారిన ప్రజలు పడుతుంటే స్థానికులే స్వచ్ఛందంగా మట్టి పోసి గోతులు పూడ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 13రోడ్ల నిర్మాణం చేపడితే మూడు రోడ్లు మాత్రమే పూర్తిస్థాయిలో విస్తరించారు. అమరావతి-తుళ్లూరు మధ్య రహదారిలో పెదమద్దూరు వద్ద వంతెన నిర్మాణం ఆగిపోయింది. విజయవాడ నుంచి అమరావతి వచ్చే పర్యటకులు ఈ మార్గంలో ప్రయాణించలేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. పత్తిపాడు-గొట్టిపాడు, నిడుబ్రోలు-చందోలు ఇలా ఏ రహదారి చూసినా గోతులమయమే. రోడ్ల విస్తరణకు నిధులు వచ్చాయని ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేశారు. కళ్లముందే రోడ్ల విస్తరణ ఆగిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే పనులెలా జరుగుతాయని నిట్టూర్చుడం మినహా నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.

అభివృద్ధి చేయాల్సిన 13 రోడ్లు ఇవే..

 •  ఉన్నవ నుంచి గుంటూరు-  చీరాల రోడ్డుకు అనుసంధానం
 •  తాడికొండ నుంచి రాయపూడి  
 •  తుళ్లూరు-అమరావతి
 •  మంగళగిరి-తాడికొండ
 •  రేవేంద్రపాడు-సీతానగరం
 •  చేబ్రోలు- వట్టిచెరుకూరు
 •  వల్లూరు-వంగిపురం
 •  గనికపూడి-ఉన్నవ
 •  ప్రత్తిపాడు-యడ్లపాడు
 •  చిలకలూరిపేట-కోటప్పకొండ
 •  తెనాలి-సిరిపురం
 •  పొన్నూరు-పందిరిపాడు
 •  నిడుబ్రోలు-చందోలు

  అంతా ఆరంభ శూరత్వమే.

న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణ సాయంతో చేపట్టిన రోడ్ల విస్తరణ గడువు ముగిసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆ కోవకే చెందినదే చేబ్రోలు- వట్టిచెరుకూరు రోడ్డు రెండు మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు డిసెంబరు 2022లో పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకానికే ప్రగతి పరిమితమైంది. చేబ్రోలు నుంచి వట్టిచెరుకూరు వరకు 12.65 కి.మీ దూరం రహదారి విస్తరించి అభివృద్ధి చేయడానికి రూ.23.22 కోట్లతో డిసెంబరు 1, 2022లో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు. ఇదీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణంతో చేపట్టిన పనుల పురోగతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని