logo

కొండలు గుల్ల చేస్తున్నారు

నిబంధనలు తుంగలో తొక్కి.. ప్రభుత్వ సంపదను కరగదీస్తున్నారు. తమకు కేటాయించిన ప్రాంతాన్ని వదిలేసి ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వేస్తున్నారు

Updated : 02 Mar 2024 05:47 IST

అక్రమ గ్రావెల్‌ తరలింపుతో రూపురేఖలు కోల్పోయిన బొబ్బేపల్లి కొండ
నిబంధనలు తుంగలో తొక్కి.. ప్రభుత్వ సంపదను కరగదీస్తున్నారు. తమకు కేటాయించిన ప్రాంతాన్ని వదిలేసి ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. పొక్లెయిన్లు, భారీ యంత్ర సామగ్రి వినియోగిస్తూ రేయింబవళ్లు వాహనాలతో గ్రావెల్‌ని తరలిస్తున్నారు. ఇది మార్టూరు మండలం బొబ్బేపల్లి కొండపై నిత్యం జరిగే మట్టి అక్రమ తవ్వకాల తంతు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

న్యూస్‌టుడే, మార్టూరు, యద్దనపూడి: మార్టూరులో మండలంలోని బొబ్బేపల్లి, కోలలపూడి, బొల్లాపల్లి, ద్రోణాదుల, ద్వారకపాడు గ్రామాలకు గ్రావెల్‌ కొండలు ప్రధాన ఆదాయ వనరులు. వీటిని తవ్వుకునేందుకు కొందరు ప్రభుత్వ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతూ ఎర్రమట్టి విక్రయిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో వందలాది సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా టిప్పర్‌ ఒకటి సుమారు రూ.3వేలు, ట్రాక్టర్‌ రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు.  నిత్యం రెండు వేలకు పైగా ట్రక్కుల మట్టి తరలివెళ్తున్నట్లు అంచనా. చిలకలూరిపేట, నరసరావుపేట, బాపట్ల, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, బల్లికురవ, పంగులూరు, అద్దంకి వంటి వివిధ ప్రాంతాలకు మార్టూరు మండలంలోని గ్రావెల్‌ కొండల నుంచి ఎర్రమట్టి తరలిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఓవైపు అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. మరోవైపు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.  

 గ్రామస్థుల ఆందోళన

గతంలో బొబ్బేపల్లి కొండపై అక్రమ క్వారీయింగ్‌ చేయడంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తవ్వకాలు ఆపకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ నిరసన తెలిపారు. ఇటీవల కూడా క్వారీయింగ్‌ ప్రాంతానికి చేరుకుని మట్టి తవ్వకాలు అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలు నిలువరించేలా పొక్లెయిన్‌తో రోడ్డును తవ్వేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో పంచాయతీ సర్పంచి ద్వారా గ్రావెల్‌ తవ్వకాలు ఆపాలని వినతిపత్రం అందజేశారు. కోలలపూడి గ్రామస్థులు తమ గ్రామంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని కొద్ది నెలల క్రితం బాపట్ల ఆర్డీవోకి ఫిర్యాదు చేయడమేకాక గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

అర్ధరాత్రులు రాకపోకలు

నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో తమకు నిద్ర కరవైందని యద్దనపూడి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ అర్ధరాత్రి దాటాకా వందల సంఖ్యలో గ్రావెల్‌ వాహనాలు తమ గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి పర్చూరు వైపు వెళ్లడంతో భారీ శబ్దాలు వస్తున్నాయని అంటున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ పెద్దసంఖ్యలో గ్రావెల్‌ టిప్పర్లు యద్దనపూడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయని, 15 టన్నులకు మించి రవాణా సాగించని రోడ్లపై 50 టన్నుల సామర్థ్యంతో వాహనాలు ప్రయాణిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలు, మట్టి తరలింపునకు ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని