logo

రా..కదలిరా సభకు సర్వం సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నా ‘రా.... కదలిరా’ కార్యక్రమం శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి వద్ద నిర్వహిస్తున్నారు

Published : 02 Mar 2024 05:45 IST

దాచేపల్లికి రానున్న తెదేపా అధినేత చంద్రబాబు

 తరలిరానున్న కార్యకర్తలు

 

ఏర్పాట్లు పరిశీలిస్తున్న తెదేపా నేతలు
ఈనాడు, అమరావతి, గురజాల: రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నా ‘రా.... కదలిరా’ కార్యక్రమం శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెదేపా శ్రేణులకు అధినేత చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేయనున్నారు. తెదేపా అధికారంలోకి వస్తే పల్నాడు ప్రాంతం అభివృద్ధికి ఏం చేస్తామో నిర్దిష్టంగా వివరించనున్నారు. వైకాపా పాలనలో పల్నాడు ప్రాంతంలో జరిగిన అరాచకాలు, దోపిడీ, హత్యలు, ప్రజల ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించి వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో పల్నాడు తెదేపా నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు రెండురోజులుగా సభా ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. విశాలమైన ప్రాంగణాన్ని ఎంపిక చేసి కార్యకర్తలు, నేతలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబు సమక్షంలో శనివారం తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం మధ్యాహ్నం తర్వాత దాచేపల్లి చేరుకునే చంద్రబాబునాయుడు రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం హైదరాబాద్‌ వెళతారు.

నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న రా... కదలిరా సభకు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. పల్నాడులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని, అందుకు దాచేపల్లి సభ ద్వారా నాంది పలుకుతామని నేతలు ప్రకటించారు. వైకాపా పాలనలో విసిగిపోయిన ప్రజలు భారీఎత్తున తరలివచ్చి అధినేత చంద్రబాబుకు అండగా నిలుస్తారని చెబుతున్నారు. దాచేపల్లి సభకు అధినేత హాజరుకానుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. తెదేపా-జనసేన పొత్తు ఖరారై సీట్లు ప్రకటన తర్వాత పల్నాడులో నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో జనసేన శ్రేణులు, నేతలు హాజరుకానున్నారు. ఈ సభ ఇరుపార్టీల కార్యకర్తల్లో జోష్‌ నింపుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. పల్నాడులో తెదేపాకు బలమైన కార్యకర్తలు ఉన్నందున వారంతా తరలివస్తే సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోనుంది. ఈ సభ ద్వారా పల్నాడులో ఎన్నికల శంఖారావానికి నాంది పలకనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ... భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో  ఇంటింటికి తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రచారం చేశారు. బహిరంగసభలో ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలతోపాటు యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, పరిశ్రమల అభివృద్ధికి తెదేపా ఏవిధమైన ప్రణాళికలు అమలు చేస్తుందో చంద్రబాబు వివరించనున్నారు. వేలమంది తరలించి సభను విజయవంతం చేయడానికి పల్నాడు జిల్లా తెదేపా నేతలు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని