logo

వైద్య ఆరోగ్య శాఖలో వసూళ్ల దందా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు, క్లినిక్‌లకు రిజిస్ట్రేషన్ల పేరుతో రూ.లక్షల్లో ముడుపులు వసూలు చేశారు.

Published : 02 Mar 2024 05:47 IST

ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ల పేరుతో రూ.లక్షల్లో ముడుపులు

 న్యూస్‌టుడే, బాపట్ల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు, క్లినిక్‌లకు రిజిస్ట్రేషన్ల పేరుతో రూ.లక్షల్లో ముడుపులు వసూలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన రోగులు, మానసిక దివ్యాంగులకు పింఛన్ల మంజూరు నిమిత్తం వచ్చిన దరఖాస్తులకు రూ.ఐదు వేలు ఇవ్వనిదే ఆమోదించటం లేదు.

 * జిల్లాలో 69 స్కానింగ్‌ కేంద్రాలు, 167 వరకు ప్రైవేటు ల్యాబ్‌లు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాలు ఉన్నాయి. ఏపీఎంసీఈ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆసుపత్రుల్లో ఉన్న క్లినికల్‌ లేబరేటరీ, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల్లో రక్త పరీక్షలు చేసిన తర్వాత కచ్చితంగా రిపోర్టు మీద అర్హత కలిగిన పెథాలజిస్టు సంతకం చేయాలి. ల్యాబ్‌లలో పెథాలజిస్టుతో పాటు బయోకెమిస్టు తప్పనిసరిగా ఉండాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, పర్యవేక్షణ డీఎంహెచ్‌వోపై ఉంది. ప్రైవేటు ల్యాబ్‌లలో పెథాలజిస్టులు లేకుండానే రక్త పరీక్షలు చేసి నివేదికలు ఇస్తున్నారు.
* ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఫిజియోథెరపీ, స్కానింగ్‌ కేంద్రాలు, డెంటల్‌ క్లినిక్‌లు వాటిలో వసతులు, పని చేసే వైద్యులు, సిబ్బంది వివరాలను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం) పోర్టల్‌లో నమోదు చేసి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ చేయకుంటే ఆ సంస్థలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్మెంట్‌(ఏపీఎంసీఈ) చట్టం కింద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
* పెథాలజిస్టుల సంతకం లేకుండానే ప్రైవేటు ల్యాబ్‌లలో రక్త పరీక్షల నివేదికలు ఇస్తున్నారని స్పందనలో జేసీకి ఫిర్యాదులు అందాయి. రిజిస్ట్రేషన్లు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు, ల్యాబ్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జేసీ ఆదేశాలతో క్లినిక్‌లు, కేంద్రాల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్లు లేని ఏబీడీఎం పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. దీనిని అదునుగా భావించి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయటానికి ఒక్కో క్లినిక్‌, ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాల నుంచి రూ.40 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా చేసిన వసూళ్లు రూ.8 లక్షల పైమాటేనని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే అంతర్గతంగా చెబుతున్నాయి. ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స కన్నా ఎక్కువగా వైద్యం చేస్తున్నారని, ఇంట్లో ఔషధాలు నిల్వ చేస్తున్నారని బెదిరించి రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగిన నగదు ఇవ్వకుంటే క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని, ఆర్‌ఎంపీల గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
* మానసిక దివ్యాంగులు, పక్షవాతం, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన రోగులకు, మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ప్రభుత్వం రూ.5 వేల పింఛన్‌ మంజూరు చేస్తోంది. దీని కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.5వేలు ఇస్తేనే సంబంధిత విభాగం సిబ్బంది ఆమోదిస్తున్నారు. లేకుంటే దరఖాస్తులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. చేసేదేమీ లేక పేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు రూ.5వేలు సమర్పించుకుని వెళ్తున్నారు. ప్రతి నెలా రూ.5 వేల పింఛను తీసుకునేవారు ఒక నెల నగదు మాకు ఇవ్వలేరా అంటూ కొందరు సిబ్బంది వ్యాఖ్యానించటం గమనార్హం. వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న అక్రమ వసూళ్ల దందాను అడ్డుకుని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని