logo

ఆనందం ఆవిరైంది.. మృత్యువు కబళించింది

బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆనందంగా గడిపి కారులో ఇంటికి బయలుదేరారు. మరో అర గంటలో గమ్యస్థానం చేరతారనగా రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కబళించింది.

Published : 02 Mar 2024 05:50 IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

 గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆనందంగా గడిపి కారులో ఇంటికి బయలుదేరారు. మరో అర గంటలో గమ్యస్థానం చేరతారనగా రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కబళించింది. ఈ దుర్ఘటన శుక్రవారం వేకువజామున బైపాస్‌ రోడ్డులోని బొంతపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... మంగళగిరికి చెందిన బంధువుల కారు తీసుకుని పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన పెళ్లికి హాజరయ్యారు. వేడుకలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు బొంతపాడు సమీపంలోకి వచ్చాక ముందు వెళ్తున్న కంకర ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో గార్లపాటి వెంకట సుబ్బమ్మ(47), గార్లపాటి పావని(17) గార్లపాటి శ్యామ్‌ దీక్షిత్‌(6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు డ్రైవర్‌ ఏకుల శ్రీకాంత్‌తోపాటు గార్లపాటి నాగలక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. మరో మహిళ రాధకు స్వల్ప గాయాలయ్యాయి. గార్లపాటి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు

శ్యామ్‌ దీక్షిత్‌ తల్లిని ఓదారుస్తున్న కుటుంబ సభ్యులు

 లోకేశ్‌ దిగ్భ్రాంతి.. రోడ్డు ప్రమాదంలో మంగళగిరికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై యువనేత, తెదేపా ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

మూడు కుటుంబాల్లో విషాదం

మంగళగిరి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం మంగళగిరి గండాలయపేటకు చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. బంగారపు పనిచేస్తూ జీవించే రామకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు శ్యామ్‌దీక్షిత్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తాపీ పని చేసుకునే అంజి కుమార్తె పావని మంగళగిరిలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ బాలిక కన్నుమూసింది. వెంకటసుబ్బమ్మ ఇంటి వద్దనే అల్పాహారం విక్రయిస్తూ జీవిస్తుంది. వీరంతా బంధువులు కావడంతో ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దీక్షిత్‌ మరణవార్త విన్న తల్లి రాధ బోరున విలపిస్తుండగా ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. పావని మృతి చెందిందనే విషయాన్ని ఆమె తల్లి నాగలక్ష్మికి తొలుత కుటుంబ సభ్యులు చెప్పలేదు. ఆతరువాత సంఘటన తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది. అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న వెంకటసుబ్బమ్మ మరణం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు