logo

జగన్‌ ధన దాహంతో కార్మికులు వీధిపాలు: లోకేశ్‌

జగన్‌ ధన దాహంతో ఇసుక అందుబాటులో లేక రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 03 Apr 2024 05:41 IST

మంగళగిరి పాత బస్‌స్టాండ్‌ కూడలిలో కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: జగన్‌ ధన దాహంతో ఇసుక అందుబాటులో లేక రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పాతబస్‌స్టాండ్‌ కూడలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కార్మికులతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.2,500 కోట్లను జగన్‌ దారి మళ్లించి కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగం పడకేసిందన్నారు. మూడు ముక్కలాటతో అమరావతి పనులు నిలిపివేయడం వల్ల కార్మికులు పొట్టచేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెదేపా పాలనలో ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.1500 ఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచేశారన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు.

పనుల్లేక పస్తులు ఉంటున్నాం సారూ..

కార్మికులు తమ సమస్యలను లోకేశ్‌ వద్ద ఏకరవు పెట్టారు. గతంలో అమరావతి నిర్మాణ పనుల్లో ఉపాధి పొందిన తామంతా ప్రస్తుతం వీధుల్లో నిలబడి పనుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారానికి మూడు రోజులు కూడా  పని లభించక అప్పులు, పస్తులతో కాలం గడపుతున్నామని వాపోయారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామన్నానరు. తాము అధికారంలో వచ్చాక అమరావతి పనులు పునఃప్రారంభిస్తామని, రానున్న ఎన్నికల్లో జగన్నోరా వైరస్‌ను ఓటు ద్వారా తరిమికొట్టాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తా..

అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జీఎస్ట్టీ భారం లేకుండా చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. మంగళగిరిలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా ఆయన మంగళవారం కలిశారు. గత తెదేపా హాయంలో చేనేతలకు అందించిన రాయితీలన్నింటినీ జగన్‌ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన లోకేశ్‌కు వివరించారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పిస్తామని, 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకంలో చేనేతలను ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నిబంధనల పేరుతో ఎక్కువ శాతం మందికి సాయం అందకుండా చేస్తుందని విమర్శించారు. గతంలో ‘ఆదరణ’ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి రూ.30 వేల విలువైన వృత్తి పరికరాలు అందించామన్నారు. అనంతరం చేనేత వర్గానికి చెందిన నీలినాగమల్లేశ్వరరావు, కర్నెల్ల శ్రీను, కొల్లి కోటయ్య నివాసాలకు వెళ్లి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు