logo

‘ఈ’ళ్ల అరాచకంపై.. కన్నెర్ర జే‘సీ’

ప్రధాని సభలో భద్రతా వైపల్యం..అధికార పార్టీ నేతల లాబీయింగ్‌, సిఫార్సులకే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యమిస్తారనే అభియోగాలున్న గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజుపై బదిలీ వేటు పడింది.

Updated : 03 Apr 2024 05:37 IST

ఈనాడు-అమరావతి
ఐజీ పాలరాజుపై బదిలీ వేటు

ప్రధాని సభలో భద్రతా వైపల్యం..అధికార పార్టీ నేతల లాబీయింగ్‌, సిఫార్సులకే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యమిస్తారనే అభియోగాలున్న గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజుపై బదిలీ వేటు పడింది. రేంజ్‌ పరిధిలో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో విపక్ష తెదేపా నాయకులు, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ కొనసాగించిన దాడులు, తప్పుడు కేసులు, పోలీసుల వేధింపులపై విపక్ష నాయకులు ఆయనకు ఫోన్లో, వ్యక్తిగతంగా కలిసి మొరపెట్టుకున్నా ఉపయోగం లేదనే ఆరోపణలున్నాయి. మొత్తంగా ఆయనపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బందోబస్తు ఏర్పాట్లలో విఫలం

గత నెల 17న పల్నాడు జిల్లా బొప్పూడిలో కూటమి ఆధ్వర్యంలో జరిగిన తొలి ప్రజాగళం భారీ బహిరంగ సభకు బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో ఆయన వైఫల్యం చెందారు. ప్రధాని సభ కావడంతో మొత్తం భద్రతను ఆయనే పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో కార్యకర్తల తోపులాటలు, కీలకమైన డీ గ్యాలరీలోకి ఎవరు పడితే వారు ప్రవేశించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. వారిని నియంత్రించడంలో ఉన్నతాధికారులు వైఫల్యం చెందారు.కొందరు కార్యకర్తలు మైకులు ఏర్పాటు చేసిన టవర్లపైకి ఎక్కడంతో మైకులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కార్యకర్తలు ప్రమాదకరంగా ఆ టవర్లు ఎక్కుతున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ గమనించి వారిని దించాలని పోలీసుల్ని అప్రమత్తం చేసినా బందోబస్తు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఐజీతో సహా గ్యాలరీ ఇన్‌ఛార్జిలుగా ఉన్న ఎస్పీలు అంతగా పట్టించుకోలేదు. ఈ మొత్తం వైఫల్యాలకు ఐజీ బాధ్యుడిగా గుర్తించి చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమవుతోంది. ఆయన్ని డీజీపీ వద్ద రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బదిలీ ఉత్తర్వులు వెలువడగానే ఐజీ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌కి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

ట్రాఫిక్‌ చలానా కేసులో

మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు ట్రాఫిక్‌ చలానాల రుసుముల్ని ప్రభుత్వానికి జమచేయకుండా తన సొంత జేబులోకి మళ్లించుకున్నారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో కథనం ప్రచురించగా స్పందించిన ఉన్నతాధికారులు మంగళగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కీలక నిందితుడు సాంబశివరావు అల్లుడు కావడంతో వెంటనే చర్యలకు ఉపక్రమించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆ కేసులో నిందితుల్ని అరెస్టు చేసే విషయంలోనూ దర్యాప్తు బృందాలతో కేసు విచారణను వేగవంతం చేయించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండికొట్టినా నిందితుడిని అరెస్టు విషయంలో బాగా జాప్యం చేశారు. వారికి చెందిన ఆస్తులను గుర్తించి కూడా అప్పట్లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని సాకుగా చూపి వారి ఆస్తులు విక్రయానికి మోకాలొడ్డారనే ఆరోపణలు వినిపించాయి.

ఆరోపణలు ఉన్నవారికే అందలం

రేంజ్‌ ఐజీ బాధ్యతలు స్వీకరించి ఈనెల 14కు ఏడాది అవుతుంది. ఈలోగానే బదిలీ వేటు పడింది. పారదర్శకంగా చేపట్టాల్సిన సీఐల పోస్టింగుల్లో అధికార నేతలు చెప్పిన వారికే ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు లేకపోలేదు. వారిలో కొందరికి ట్రాక్‌ రికార్డు బాగోకపోయినా ఎన్నికల వేళ వారికి పోస్టింగుల్లో  ప్రాధాన్యమివ్వడంపై విమర్శలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఆదేశాల మేరకు సొంత జిల్లాలో పనిచేస్తున్న వారిని, ఒకేచోట మూడేళ్ల పైబడి చేస్తున్న వారిని ఇప్పటికే బదిలీ చేశారు. రాజకీయ నేతల సిఫార్సులకు అనుగుణంగా పనిచేశారని విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది  కొందరు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బాధితులు వచ్చి వినతులు అందజేసినా చర్యలు తీసుకోలేదు. రేంజ్‌లోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో వంద మందికి పైగా సీఐలను బదిలీ చేశారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు రాజకీయాలకతీతంగా సీఐలను నియమించి మెరుగైన శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నేతలు సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.


ఈనాడు-అమరావతి
ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి పైనా చర్యలు

పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్ని అరికట్టలేకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రవిశంకర్‌రెడ్డిపై ఉన్నాయి. ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో జనం ముందుకు తోసుకొచ్చి ఆడియో సిస్టంపై పడడంతో మైకులు పని చేయక ప్రసంగానికి ఆటంకం ఏర్పడింది.భద్రతా పరంగా అత్యంత కీలకమైన డీ జోన్‌లోకి నీళ్ల సీసాలు విసురుతుంటే పోలీసులు నియంత్రించలేకపోయారు. సభలో పోలీసుల వైఫల్యంపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు.

గతంలోనూ ఫిర్యాదు..

రవిశంకర్‌రెడ్డిపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి వచ్చి రెండేళ్లవుతోంది. తెలుగుదేశం వారిపై హత్యలు, దాడులు జరుగుతున్నా అవన్నీ వ్యక్తిగత గొడవలుగా చెబుతూ వచ్చారు. రాజకీయ హత్యల్ని, హింసను నియంత్రించలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి అధికారి ఉంటే పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగదని ప్రతిపక్షాలు భావించి పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వీటిన్నింటి నేపథ్యంలో రవిశంకర్‌రెడ్డి బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి ఎస్పీగా రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు.

పల్నాట పోలీసు రాజ్యం

పల్నాడు జిల్లాలో పోలీసు రాజ్యం కొనసాగుతోంది. ఆయా స్టేషన్లలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైకాపా నేతలు దాడి చేసినప్పుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లే ప్రతిపక్షాల నేతలు, సానుభూతిపరులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ వారిపై నామమాత్రపు కేసులు పెట్టడం, బాధితులపై బెయిల్‌ రాని సెక్షన్లు పెట్టి జైలుకు పంపుతున్నారు. తెదేపా నేతలను పట్టపగలే హత్యలు చేస్తున్నా కట్టడి చేయలేని దుస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది. రాష్ట్రస్థాయి తెదేపా నేతలు వచ్చి ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులకు పలుమార్లు ఆయా ఘటనలపై ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాలేదు.

బైండోవర్లతో ప్రతిపక్షాల కట్టడి

పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు ప్రతిపక్షనేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. క్రియాశీలకంగా ఉన్న నేతలను రౌడీషీట్‌ పరిధిలోకి తెచ్చి వారిని ఎన్నికల సమయంలో చురుగ్గా పని చేయకుండా చేయాలనే వ్యూహాన్ని అమలుచేశారు. ప్రతిపక్షాలకు చెందిన గ్రామస్థాయి నేతలను బైండోవర్‌ పేరుతో కట్టడి చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందేలా ప్రణాళిక రచించారు. మాచర్ల నియోజకవర్గంలో పట్టపగలు ప్రతిపక్ష పార్టీకి చెందిన తోట చంద్రయ్యను గ్రామ నడిబొడ్డున హత్య చేసిన వైకాపా వారిపై రౌడీషీట్‌ తెరవలేదు. అదే గ్రామంలో తెదేపా నేతలు, సానుభూతిపరుల పొలాలు, ఇళ్లలో ఆయుధాలు పెట్టి వారిపై కేసులు పెట్టి రౌడీషీట్‌ తెరవడం గమనార్హం.

కొనసాగుతున్న హత్యల పరంపర

  • వైకాపా అధికారం చేపట్టగానే పల్నాడులో అరాచక పర్వానికి తెరలేచింది. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా నేత చంద్రయ్యను నడిరోడ్డుపై పట్టపగలే వైకాపా నాయకులు పీక కోయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
  • 2022 జూన్‌ నెలలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దారి కాచి హత్య చేశారు.
  • మాచర్ల పట్టణంలో గతేడాది డిసెంబరులో తెదేపా నేతల ఇళ్లు, వాహనాలే లక్ష్యంగా దాడులు చేసి ధ్వంసం చేశారు. తెదేపా కార్యాలయానికి నిప్పంటించి ఆరాచకం సృష్టించారు. ఇంత జరిగినా నామమాత్రపు కేసులతో సరిపెట్టి పోలీసులు స్వామిభక్తి చాటుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై పదుల సంఖ్యలో ఉన్న మూక దాడి చేసి బీభత్సం సృష్టించిన వైనం నేటికీ కళ్లకు కనపడే నిజం.
  • కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తెదేపా ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డిని ట్రాక్టర్‌లో ఊరేగించారని అదేరోజు రాత్రి ట్రాక్టర్‌కు నిప్పంటించడం ఇక్కడి సంస్కృతికి సజీవ సాక్ష్యమే. ఇటీవల తెదేపా నేత కారు కాల్చివేయడం, జనసేన నేతల కారుపై దాడిచేసి గాయపర్చడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా పోలీసులు తీరులో మార్పు లేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని