logo

వైకాపా నాయకుల అరాచకం

పల్నాడులో వైకాపా శ్రేణుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా వారి అరాచకాలు సాగుతూనే ఉన్నాయి.

Published : 22 Apr 2024 04:26 IST

తెదేపా ప్రచారం అడ్డగింత.. దాడి

బెల్లంకొండ: పల్నాడులో వైకాపా శ్రేణుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా వారి అరాచకాలు సాగుతూనే ఉన్నాయి.  తాజాగా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి నాగిరెడ్డిపాలెంలోని ఎస్టీ కాలనీలో నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు తరఫున ఆయన సోదరి రుద్రమదేవి ప్రచారం చేపట్టారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ.. ప్రధాన కూడలిలోని వైకాపా కార్యాలయం మీదుగా వెళుతున్న సమయంలో వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెదేపా కార్యకర్తలను దుర్భాషలాడారు. అయినా పట్టించుకోకుండా ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం తెదేపా కార్యాలయం వద్దకు చేరుకోగా.. అక్కడికి భారీగా వైకాపా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. డీజే వాహనాలతోపాటు ఎన్నికల ప్రచార వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచారు. దీనిపై ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలను దూషిస్తూ.. దాడులకు పాల్పడ్డారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. తెదేపా శ్రేణులను చెదరగొట్టారు. అక్కడి నుంచి వారిని పంపించేయడంతో వారు మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెదేపా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గ్రామంలోకి 20కి పైగా వైకాపా ప్రచార రథాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణుల కోసం వండించిన భోజనాన్ని నేలపాలు చేశారని తెదేపా నాయకులు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని