logo

అరాచక పాలనను కలిసికట్టుగా సాగనంపుదాం

రాష్ట్రంలో అరాచక పాలనపోయి, శాంతిభద్రతలు సవ్యంగాఉంటేనే వ్యాపారాలూ బాగుంటాయి.. ఈ విషయాన్ని గుర్తించి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 04:27 IST

మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్‌, వేదికపై ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పెమ్మసాని శ్రీరత్న, నాయకులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలనపోయి, శాంతిభద్రతలు సవ్యంగాఉంటేనే వ్యాపారాలూ బాగుంటాయి.. ఈ విషయాన్ని గుర్తించి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. తెనాలి గౌతమ్‌ గ్రాండ్‌లో ఆదివారం వ్యాపారులు, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు, పెద్ద వ్యాపారుల లావాదేవీలు తెలుసుకుని, వాటా కావాలని బెదిరించే భయానిక వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని, గతంలో ఎన్నడూ ఈ తీరు మనం చూడలేదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం, వ్యాపారులు, ప్రతి కుటుంబం ఎంతగా నష్టపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, రాష్ట్రాన్ని చక్కగా పాలించి ప్రగతి సాధించాలన్న ఆలోచనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ చేయలేదని విమర్శించారు. తెనాలి పాలకులు లోకల్‌ ఎజెండాతో సంక్షేమ అభూత కల్పనలు చెప్పటమే తప్ప సాధించిన ప్రగతి శూన్యమని విమర్శించారు. నూతన ప్రభుత్వంలో వ్యాపారులకు అవసరమైన సమగ్ర మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని మనోహర్‌ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగు జాతి వారందరూ వైకాపా పీడను తొలగించుకోవటానికి ఓటు అనే ఆయుధంతో ముందడుగు వేయాలన్నారు. రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చారని, తెనాలి వంటి చరిత్రాత్మక నియోజకవర్గంలోనూ శాంతిభద్రతల పరిస్థితిని గందరగోళం చేశారని విమర్శించారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్న మాట్లాడుతూ అందరి ఎజెండా ఒకటేనని, సుపరిపాలనకు కూటమికి పట్టం కట్టాలని కోరారు. నాయకులు పెండేల వెంకట్రావు, పాటిబండ్ల రామకృష్ణ, డాక్టర్‌ శారద, రమేశ్‌బాబు, రాజేశ్‌బాబు, కోటేశ్వరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని