logo

జడ్పీకి నిధుల పోటు

స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు.

Updated : 22 Apr 2024 06:33 IST

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం  

న్యూస్‌టుడే, జిల్లాపరిషత్తు(గుంటూరు): స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లాపరిషత్తులు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం అధికారాలతో పాటు నిధులను కూడా తన వద్దే ఉంచుకోవడంతో పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. జిల్లా స్థాయిలో పెద్దన్న పాత్రను పోషించే జిల్లాపరిషత్తు నిధుల ‘పోటు’తో నామమాత్రంగా మిగిలిపోతుందనే విమర్శలు ఉన్నాయి.

నిధుల విడుదలలో జాప్యం

పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు ఇసుక, గనులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే సెస్సు ప్రధాన ఆదాయ వనరులు. వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి గనుల శాఖ ద్వారా ఇసుక విక్రయం చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచి ఓ సంస్థకు అనుమతులు వచ్చేలా చేసింది. పేరుకు ఆ సంస్థ ఉన్నప్పటికీ బినామీల ద్వారా కృష్ణా నదీ తీర ప్రాంతంలోని రేవుల్లో ఇసుక విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో స్థానిక సంస్థలకు సెస్సు రూపంలో ఇవ్వాలి. వచ్చిన మొత్తంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తీసుకుని జిల్లాపరిషత్తు, 57 మండల పరిషత్తులు, 1,011 పంచాయతీలకు దామాషా విధానంలో నిధులు కేటాయిస్తారు.  

జిల్లాపరిషత్తు కార్యాలయ భవనం మరమ్మతులకు గురవడంతో కొత్తది నిర్మించేందుకు రూ.13 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా రెండేళ్ల కిందట ప్రకటించారు. ఇప్పటికీ నిధులు విడుదలవకపోవడంతో శిథిల భవనంలోనే ఉద్యోగులు భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. జడ్పీ ఉద్యోగుల నివాస సముదాయం కూడా నివాస యోగ్యంగా లేదని ఇంజినీర్లు నివేదిక సమర్పించారు. క్వార్టర్స్‌ కూల్చివేసి కొత్తవాటితో పాటు కల్యాణ మండపం నిర్మిస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఏ పని చేయాలన్నా నిధుల సమస్య ఎదురవటంతో జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చడం లేదు. దాంతో అధికార వైకాపాకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తే వాటిని చూపించి ఓట్లు అడిగే వాళ్లమని, అభివృద్ధి పనులు చేయకుండా వారి వద్దకు ఎలా వెళ్లగలమని నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు.

కార్యరూపం దాల్చని తీర్మానాలు

  • ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తులో 54 మంది జడ్పీటీసీ సభ్యుల్లో వైకాపా వారు 53 మంది ఉన్నారు. తెదేపా నుంచి శావల్యాపురం జడ్పీటీసీ సభ్యురాలు పారా హైమావతి సూచించిన పనులకు నిధులు కేటాయించలేదు.
  • ఇసుక సీనరేజీ ద్వారా జిల్లాపరిషత్తుకు రూ.10 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్టాంప్‌డ్యూటీ రూ.15 కోట్లు, మినరల్‌ సీనరేజి రూ.3.60 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇసుక సీనరేజీ నిధులు విడుదల చేయలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వడం లేదు. కొత్తగా పనులు మంజూరు చేయక జడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
  • ఇసుక, మినరల్‌ సీనరేజీ, స్టాంప్‌ డ్యూటీ కలిపి మొత్తం రూ.13.88 కోట్ల నిధులను జడ్పీకి ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనివల్ల అభివృద్ధి పనులకు జిల్లాపరిషత్తు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, కచ్చా డ్రెయిన్లు, రక్షిత నీటి పథకాల పనులు, అనుసంధాన రహదారులు, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, ఇతర పనులు చేసేందుకు నిధుల సమస్య ఎదురవుతోంది.

ఇబ్బందులు పడుతున్నాం

జిల్లాపరిషత్తు బడ్జెట్‌ రూ.60 కోట్లకు అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లయినా కేటాయించాలి. సగటున ఒక్కో జడ్పీటీసీ సభ్యుడికి రూ.15 లక్షలు చొప్పున కేటాయించాల్సి ఉండగా కొందరికే కేటాయించారు. అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మంజూరు చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకూ ఇబ్బందులే. సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తాను.

పిల్లి ఓబుల్‌రెడ్డి, రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని