logo

అల్లర్ల వేళ .. బలగాలు చేరేదెలా..

గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు.

Updated : 22 Apr 2024 06:22 IST

గుంతలమయంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గ్రామాలకు వెళ్లే మార్గాలు
పావుగంట ప్రయాణానికి.. గంటకు పైనే..
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

మాచర్ల మండలం ఏకోనాంపేట పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే దారి

గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు. పల్నాడులోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్న గ్రామాలకు చేరుకోవాలంటే.. రహదారులన్నీ గుంతలమయమే. పది నిమిషాలు ప్రయాణించాల్సిన మార్గంలో.. గంటకూ గమ్యం చేరలేని దుస్థితి. ఇలాంటి ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే సాయుధ బలగాలు చేరుకునేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్న మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 445 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. వీటిలో చాలా కేంద్రాలకు రోడ్డుమార్గం సరిగా లేదు. అందువల్ల ఎన్నికల సంఘం ముందుజాగ్రత్త చర్యగా అన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనూ అదనపు బలగాలను మోహరించాలి.

దుర్గి మండలం మించాలపాడుకు వెళ్లే మార్గం..

అడ్డూ అదుపూ లేని దాడులు

పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేదు. కొందరు పోలీసులు కూడా.. పార్టీ కార్యకర్తల కంటే మిన్నగా వ్యవహరిస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఎన్నికల సంఘం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

బెల్లంకొండ నుంచి వెంకటాయపాలెం వెళ్లే రోడ్డు

మూడు నియోజకవర్గాల్లోనూ..

మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పలు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మాచర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏకోనాంపేట వెళ్లాలంటే గోతుల కారణంగా గంటపైగానే పడుతోంది. కృష్ణానది పక్కనుండే ఈ గ్రామానికి మరో మార్గం లేదు. ఇదే మండలంలో ద్వారకాపురి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది.

  • మించాలపాడులో ఇటీవలే వైకాపా నేతలు.. తెదేపా వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. దుర్గి నుంచి మించాలపాడుకు వెళ్లే మార్గమంతా గుంతలు.. అందులో మూడు కిలోమీటర్లు మట్టిరోడ్డే. పోలింగ్‌ రోజు అల్లర్లు జరిగితే.. హుటాహుటిన బలగాలు చేరుకోవాలన్నా కష్టమే. వెల్దుర్తి మండలంలో సేవానాయక్‌ తండా, వజ్రాలపాడు తండాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా గుంతలే.
  •  గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో తంగెడ, ముత్యాలంపాడు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మరింత దారుణం. దాచేపల్లి నుంచి 12 కిలోమీటర్లు ఉండే ఈ మార్గమంతా గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సిందే.
  • రెంటచింతల మండలంలో పాల్వాయి జంక్షన్‌- జెట్టిపాలెం, జెట్టిపాలెం-మల్లవరం, పాల్వాయి జంక్షన్‌- తుమృకోట, పాల్వాయిగేట్‌-మంచికల్లు రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఈ మండలంలో అల్లర్లకు ఆస్కారం ఉందని ప్రతిపక్షాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. తుమృకోట-జమ్మలమడక రహదారిలో ఒక లేయర్‌ వేసి వదిలేయడంతో.. దుమ్ము విపరీతంగా లేస్తోంది.
  • పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ నుంచి 18 కి.మీ. దూరంలో ఉండే వెంకటాయపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కొన్నేళ్లుగా మరమ్మతులే లేవు. అరగంటలో వెళ్లాల్సి ఉంటే.. 2 గంటలు పడుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని