logo

సైకిల్‌ దూకుడు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Published : 22 Apr 2024 04:41 IST

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు
మరింత ముమ్మరం కానున్న ప్రచారాలు
ఈనాడు, అమరావతి

చంద్రబాబుతో ధూళిపాళ్ల, లోకేశ్‌, శ్రావణ్‌కుమార్‌, పెమ్మసాని, నసీర్‌, మాధవి, రామాంజనేయులు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, భాజపా నేతలతో కలిసి ప్రజలను కలుసుకుని ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఆదివారం తెదేపా అధినేత ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను పార్టీ కార్యాలయంలో అందించి దిశా నిర్దేశం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీఫారాలు తీసుకున్నారు. ప్రచార ఒత్తిడి, ఇతర కార్యక్రమాలు ఉన్న ఇద్దరికి నేతల చేత బీఫారాలు అందించే ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు మరింత ఉత్సాహంతో ప్రచారానికి సిద్ధమయ్యారు. నామినేషన్‌ దాఖలు చేసిన వారు ఇక పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోమవారం పలువురు అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే ప్రచారం ఊపందుకోనుంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఖరారు, బీఫారాల పంపిణీ తదితర అంశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రణాళికాయుతంగా వ్యవహరించడం అభ్యర్థులకు కలిసొచ్చింది. ముందస్తుగా అభ్యర్థులను నిర్ణయించడం వల్ల ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను ఒకసారి కలుసుకుని తాము అందరికీ అందుబాటులో ఉంటామని, ఆదరించాలని కోరారు. ఇంకా 20 రోజులు ప్రచారం చేయడానికి సమయం ఉండడంతో వీలైనంత సమయం ప్రచారంలోనే ఉంటూ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రగతికి అమలు చేసే ప్రణాళికలను తెలియజేస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఏయే వర్గాలు ఏమేరకు నష్టపోయాయో ప్రజలకు వివరించి ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని