logo

రాజధాని మహిళల కష్టాలు చూస్తే బాధేస్తోంది

రాష్ట్రం డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది.

Updated : 22 Apr 2024 06:21 IST

రాష్ట్రం డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారింది
ఇక్కడ పరిశ్రమలు.. యువతకు ఉద్యోగాల్లేవు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో నారా బ్రాహ్మణి
తాడేపల్లి, న్యూస్‌టుడే

పూలు కోసే మహిళా కార్మికులతో నారా బ్రాహ్మణి

రాష్ట్రం డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భావితరాలకు భవిష్యత్తు’ అని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో పర్యటించారు. ఇక్కడి పూల తోటలను పరిశీలించి పూలుకోసే మహిళా కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.

రెండురోజులుగా లోకేశ్‌ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు.?

బ్రాహ్మణి: మంగళగిరి ప్రజలు కుటుంబ సభ్యురాలిలా ఆదరిస్తున్నారు. వారి కష్టాలు చెప్పుకొంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇక్కడ పరిశ్రమల్లేక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మహిళలు కుటుంబ పోషణ నిమిత్తం ఎండలో..వానలో కష్టపడుతున్నారు. వారిని చూస్తే చాలా బాధేస్తోంది. లోకేశ్‌ ప్రారంభించిన ‘స్త్రీశక్తి’ పథకం చాలా మంది మహిళలను ఆదుకుంటోంది. టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అధికారంలో లేకున్నా 29 సంక్షేమ కార్యక్రమాలు లోకేశ్‌ సొంత నిధులతో అమలు చేస్తున్నారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.

మంగళగిరిలో చేనేత వృత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. వారికి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. చేనేత ఉత్పత్తులకు ఎలాంటి మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించబోతున్నారు.

బ్రాహ్మణి: చేనేత అనేది చాలా గొప్ప కళ. మంగళగిరి చేనేత చీరలు, డ్రస్‌ మెటీరియల్స్‌కు మంచి పేరు ఉంది. వారిపై దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు. నారా లోకేశ్‌ ‘టాటా తనేరా’ సంస్థతో ఒప్పంద చేసుకుని నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఇక్కడ నేసిన వస్త్రాలకు ప్రపంచస్థాయి మార్కెట్‌ కల్పించబోతున్నారు. మంగళగిరి రూపుమార్చాలన్నదే ఆయన లక్ష్యం.

రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా చూస్తారు.

బ్రాహ్మణి:  రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయింది. నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, దానికి అలవాటు పడి తమ భర్తలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం డ్రగ్స్‌కు క్యాపిటల్‌గా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. చంద్రబాబు హయాంలో ఈ పరిస్థితి లేదు. మళ్లీ ఆయన సీఎం అయితే భావితరాల భవిష్యత్తుకు కృషి చేస్తారు.

చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అదే విధంగా తెదేపా నాయకులపైనా కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఆలోచించాలి.  

బ్రాహ్మణి: ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలే. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారు.

ఎన్నికల వరకు ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళతారు.?

బ్రాహ్మణి: మహిళల సంక్షేమం, అభివృద్ధే నా లక్ష్యం. ఇందులో భాగంగా అన్ని వర్గాల మహిళలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటున్నా. ఆ దిశగా ప్రచారం కొనసాగిస్తా. లోకేశ్‌ అమలు చేస్తోన్న ‘స్త్రీశకి’్త పథకం ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని