logo

అమ్మ ఒడి నుంచి రూ.20 కోట్ల నొక్కుడు!

ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా? అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకునే సీఎం జగన్‌ అసలేం చేస్తున్నారో తెలుసా..?

Updated : 22 Apr 2024 06:29 IST

మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మళ్లింపు
నామమాత్రంగానే ఖర్చు
ప్రైవేటు పాఠశాలలకు మొండిచేయి
ఈనాడు - అమరావతి

ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా? అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకునే సీఎం జగన్‌ అసలేం చేస్తున్నారో తెలుసా..?

అమ్మ ఒడి పేరుతో ఇస్తున్న రూ. 15 వేలలో రూ. 2 వేల చొప్పున సర్కారు కోత విధిస్తోంది. పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ, మేనేజ్‌మెంట్‌ కమిటీ ఫండ్‌ పేరుతో వెనక్కి లాగేసుకుంటోంది.

అదైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తోందా.. అంటే అదీ లేదు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లోని లబ్ధిదారుల నుంచి రూ. 2 వేల చొప్పున వెనక్కి లాగేసుకుంటూ దారి మళ్లించేస్తోంది. ఇదీ జగన్‌ సర్కారు నిర్వాకం.

పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, ఆయాల జీతాల చెల్లింపుల కోసమే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 వేలను వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్‌ సర్కారు చెప్పింది. తల్లుల ఖాతాకు రూ. 13 వేల చొప్పున మాత్రమే జమ చేస్తోంది.

మినహాయించుకున్న సొమ్మును విద్యార్థుల అవసరాలకే ఖర్చు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ.. సర్కారు ఆ పని చేయడం లేదు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కొద్దిగానే వెచ్చిస్తోంది. ప్రైవేటు పాఠశాలల విషయానికొస్తే.. ఆ రూ. 2 వేల నుంచి ఒక్క పైసా కూడా వాటికి ఇవ్వకుండా తనే దిగమింగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా గతేడాది రూ. 20 కోట్లను లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకుంది. ఇందులో కనీసం సగం కూడా పాఠశాలల్లో ఖర్చు పెట్టి ఉండదని ఉపాధ్యాయులే చెబుతున్నారు.

సర్కారు దోపిడీ ఇలా..

ఉదాహరణకు గుంటూరు నగరంలోని ఓ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు అమ్మఒడి సాయం పొందారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 వేల చొప్పున సర్కారు మినహాయించుకున్న మొత్తం రూ. 4 లక్షలు. మరి ఈ మొత్తాన్ని ఆ పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రతకు వెచ్చించిందా? అంటే లేనేలేదు. ఈ పనుల కోసం ప్రతి పాఠశాలకు మూడు మాసాలకోసారి రసాయనాలు, సామగ్రి, ఇతర శుభ్రత యంత్రాలకు ఏడాదికి రూ. 20 వేలకు మించి అవదని చెబుతున్నారు. మరుగుదొడ్లు కడిగే ఆయా, స్కావెంజర్‌కు నెలకు రూ. 6 వేల చొప్పున 11 మాసాలకు రూ. 66 వేల వేతనం చెల్లిస్తున్నారు. అంటే మొత్తం వ్యయం రూ. లక్ష లోపే ఉంది. మిగిలిన రూ. 3 లక్షలను విద్యార్థుల పేరుతో ప్రభుత్వమే దారి మళ్లిస్తోందని ప్రధానోపాధ్యాయులంటున్నారు. అంటే పైకి ప్రభుత్వం చెబుతున్న మాటొకటి. వాస్తవంలో చేస్తున్నదొకటి. పిల్లల కోసం ఇస్తున్న మొత్తంలో కోత పెట్టి.. ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించడాన్ని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు సైతం ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. తమ పాఠశాలలకు గత రెండేళ్ల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలలు : 3,780
అమ్మ ఒడి సాయం పొందుతున్నవారు (సుమారు) : 70 వేలు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు : 1,400
అమ్మ ఒడి సాయం పొందుతున్నవారు : 30 వేలు
ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లోని అమ్మ ఒడి లబ్ధిదారులు : సుమారు లక్ష
రూ.2వేల చొప్పున ప్రభుత్వం మినహాయించుకుంటున్న మొత్తం ఏడాదికి : రూ. 20 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని