logo

దీవెనలన్నావు.. దగా చేశావు!

అధికారంలోకి వచ్చాక అతని అసలు రూపం చూపించాడు. అసలు బోధనా రుసుములు ఎప్పుడొస్తాయో తెలియకుండా పోయింది. అది ఎంతమందికి జమవుతాయో.. ఎన్నాళ్లకు జమవుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి.

Updated : 22 Apr 2024 06:25 IST

విద్యార్థులకు బోధన రుసుములు చెల్లించని జగన్‌
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 వేల మందికి ఇబ్బందులు

  • మాచర్ల చింతలతండాకు చెందిన రమ్యానాయక్‌ గురజాలలో ఓ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే సెమిస్టర్‌ పరీక్షలు దగ్గరపడ్డాయి. పరీక్షలు రాయాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల వారు ఒత్తిడి చేశారు. విద్యార్థి కుటుంబం చేసేది లేక అప్పు చేసి చెల్లించింది.
  • నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన ఓ విద్యార్థిని బీటెక్‌ చదువుతోంది. కరోనా సమయంలో ప్రభుత్వం విద్యాదీవెన నగదు జమ చేయలేదు. అంతలో చదువు పూర్తయింది. ఆ విద్యార్థినికి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. మరోపక్క కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని చెప్పింది. రెండు నెలల జీతం తీసుకొచ్చి వాటితో కళాశాల ఫీజు బకాయిలు చెల్లించి ధ్రువపత్రాలను తీసుకెళ్లింది.

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేటసెంట్రల్‌

మీ పిల్లల చదువులకు పూర్తి భరోసా నాది. వారు ఇంజినీరింగా? మెడిసినా ఏదైనా చదువుకోమనండి. అందుకు అయ్యే ఫీజులను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది.

జగన్‌

అధికారంలోకి వచ్చాక అతని అసలు రూపం చూపించాడు. అసలు బోధనా రుసుములు ఎప్పుడొస్తాయో తెలియకుండా పోయింది. అది ఎంతమందికి జమవుతాయో.. ఎన్నాళ్లకు జమవుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఈ దుస్థితిలో బోధనా రుసుముల చెల్లింపులు విధానం తయారైంది. పేద విద్యార్థుల చదువుల బాధ్యతను మీ అన్న జగన్‌ తీసుకున్నాడని సభల్లో ఊకదంపుడు ప్రసంగాలిచ్చే జగన్‌ మాటలకు ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయన చెప్పాడంటే చేయడనే పరిస్థితికి విద్యార్థులే వచ్చారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. జగన్‌ జమానాలో సకాలంలో ఫీజులు అందక కళాశాల యాజమాన్యాల సూటిపోటి మాటలకు ఎందరో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పటికీ జమకాలే..

ఎప్పుడో జూన్‌, జులైలో విడుదల చేయాల్సిన మొదటి వాయిదా రుసుములను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన బటన్‌ నొక్కారు. తర్వాత పది రోజులకు కొద్దిమందికే జమయ్యాయి. బటన్‌ నొక్కి 50 రోజులైనా ఇప్పటి వరకు మొదటి వాయిదా ఫీజులే చాలామంది విద్యార్థులకు జమకాలేదు. విద్యార్థులు ఫీజులు చెల్లించాలని కళాశాలల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు పడతాయని ఎదురుచూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా పత్రాలు సరిగ్గా సమర్పించలేదని మెసెజ్‌లు వస్తుండటంతో ఇక డబ్బులు పడవని ఆశలు వదిలేశారు. సెమిస్టర్‌ పరీక్షల వేళ హాల్‌టికెట్లు ఇవ్వాలంటే ఫీజులు చెల్లించాల్సిందేనని ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారు. విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించకుంటే రోజుకు రూ.500 అపరాధ రుసుం చెల్లించాలని కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా చూస్తే డిగ్రీ, ఇంజినీరింగ్‌ తత్సమాన కోర్సులు చదివే వారు 50 వేల మంది వరకు ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు వాయిదాల్లో బోధనా రుసుములు చెల్లిస్తామని చెప్పినా ఈ ఐదేళ్లలో ఠంఛన్‌గా జమచేసిన దాఖలాలు మచ్చుకు ఒకటీ లేదని కళాశాల యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి.

పథకం ప్రారంభం నుంచి కష్టాలే

ప్రభుత్వం పథకం ప్రారంభించినప్పటి నుంచి పలు రకాల పత్రాలు, ఖాతాలను ఆధార్‌కు అనుసంధానంతో లబ్ధిదారులు ముప్పుతిప్పలు తప్పలేదు. మొదటి సంవత్సరం విద్యాదీవెన నిధులు జమ చేసినా రెండో ఏడాది అదే తంతు. మూడో ఏడాది తల్లి, విద్యార్థికి కలిపి సంయుక్త ఖాతా తెరవాలని మళ్లీ ఇబ్బంది పెట్టారు. అనంతరం పత్రాలు సరిగా లేవని సగం మంది విద్యార్థులకు నగదు జమ చేయలేదు. చివరి సంవత్సరంలో అసలు డబ్బులు వేయకుండానే నిధులు విడుదల చేశామని, ఆలస్యంగా పడతాయని మభ్యపెట్టడం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ వచ్చాక ఇక డబ్బులు పడవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు.

అసలే కోర్సు ఫీజులు తగ్గించటంతో

విద్యార్థులకు సకాలంలో బోధనా రుసుములు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడమే కాదు ఆయా కోర్సుల ఫీజులను తగ్గించి చివరకు తమను ఐదేళ్లుగా ఇబ్బంది పెడుతోందని కళాశాల యాజమాన్యాలు అంటున్నాయి. ఆయా కోర్సుల ఫీజులను తగ్గించటంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందని అమరావతిరోడ్డులో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు తన వాటాను అమ్మేసుకుని బయటకు వచ్చేశానని వివరించారు. 2004 ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుంచే బోధనా రుసుముల చెల్లింపు విధానం ఉంది. కానీ ఏ ప్రభుత్వ హయాంలో కూడా చెల్లింపులు ఇంత జాప్యం కాలేదు. నాలుగేళ్ల క్రితం ఇవ్వాల్సిన పీజీ విద్యార్థుల రుసుములు ఇప్పటి వరకు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించింది. ఆయా కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించకపోవటంతో చాలామంది విద్యార్థులు వారి ధ్రువపత్రాలను పట్టుకెళ్లలేదని ప్రత్తిపాడు రోడ్‌లో ఉన్న ఓ కళాశాల నిర్వాహకులు గుర్తు చేశారు. రుసుములు చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించటంతో చాలా మంది కొలువులు, ఉన్నత చదువులకు దూరమయ్యారని కళాశాల యాజమాన్యాలు సైతం అంటున్నాయి.


ఫీజులు చెల్లించమంటున్నారు

విశాఖపట్టణంలోని కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మొదటి సంవత్సరం మా అమ్మ ఖాతాకు డబ్బులు వేశారు. ఆ సమయంలో ఖాతా తెరిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ఏడాది నాకు, అమ్మకి కలిపి ఉమ్మడి ఖాతా తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక విశాఖపట్టణం నుంచి రూ.1000 ఛార్జీలు పెట్టుకొని వచ్చా నరసరావుపేటకు వచ్చా. అంతేకాకుండా బ్యాంకు ఖాతాకు ఫోన్‌పే, గూగుల్‌ పే ఉండరాదనే నిబంధన పెట్టారు. సంయుక్త ఖాతాలో డబ్బులు తీసేందుకు ఇద్దరు ఉంటేనే ఇస్తారు. లేదంటే లేదని చెప్పడంతో ఖాతా తెరిచేందుకు, డబ్బులు తీసుకునేందుకు రెండుసార్లు రావాల్సి వచ్చింది. ఇలా బ్యాంక్‌ ఖాతాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇంతచేసినా రెండో విడత నిధులు పడలేదు.

ఉదయ్‌


అప్పు చేసి చెల్లించాం: అనిత, నరసరావుపేట

మా అబ్బాయి బీటెక్‌  చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం బ్యాంకు ఖాతా తెరిచేందుకు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ధ్రువపత్రాలు సరిగా లేవని, సంతకాలు సక్రమంగా లేవని తిప్పారు. రెండో ఏడాది మళ్లీ సంయుక్త ఖాతా తెరవాలని నిబంధనతో మళ్లీ ఇబ్బంది పెట్టారు.  ఇటీవల ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాయనిస్తామని, లేదంటే పరీక్షకు హాజరు కానివ్వమని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో చేసేది లేక అప్పు చేసి ఫీజు చెల్లించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని