logo

బంగారు బిస్కెట్‌ కావాలా నాయనా!

తక్కువ ధరకు పసిడి ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.4కోట్లు కాజేశారు మాయగాళ్లు.

Updated : 25 May 2024 08:09 IST

తక్కువ ధరకు పసిడి అంటూ రూ.4 కోట్లు స్వాహా

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ ధరకు పసిడి ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.4కోట్లు కాజేశారు మాయగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  రామంతాపూర్‌కు చెందిన విశాల్, వినయ్, అఖిల్‌ తేలికగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. గొలుసుకట్టు తరహాలో తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు అంటూ ప్రచారం చేశారు. మహిళలు లక్ష్యంగా ఆకట్టుకునే ప్రకటనలు గుప్పించారు. ఆసక్తిగల వారి నుంచి రూ.50వేల నుంచి పెట్టుబడులు స్వీకరించారు. బంధువులు, స్నేహితులను సభ్యులుగా చేర్పిస్తే పెద్దమొత్తం కమీషనంటూ ఆశచూపటంతో చాలామంది వీరి ఉచ్చులో పడ్డారు. మార్కెట్‌ ధరకంటే 10 శాతం తక్కువకే మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మకం కలిగించారు. చేతికి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ దేశ, విదేశాల్లో పసిడి వ్యాపారం చేస్తున్నామంటూ బురిడీ కొట్టించారు. సభ్యుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో విదేశాల్లో స్వర్ణం కొనుగోలు చేశామని, వచ్చిన లాభాలను పంచుతున్నామంటూ కొంతమేర చెల్లించారు. ఇది నిజమని నమ్మి.. సభ్యులు పెరుగుతూ వచ్చారు. భారీ మొత్తం సొమ్ము రాగానే వారంతా సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో తాము మోసపోయినట్టు బాధితులు గుర్తించారు. అంబర్‌పేట్, రామంతాపూర్‌కు చెందిన ఇద్దరు తాము రూ.15లక్షలు చెల్లించామని వాపోయారు.  బాధితులు మొత్తం రూ.4కోట్ల మేర నష్టపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో 19 మంది సభ్యులు బంగారు పథకం(గోల్డ్‌స్కీమ్‌) మాయలో పడి రూ.2.31కోట్లు పోగొట్టుకున్నట్టు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు