logo

Rave Party: ఇక్కడ దొరికితే సాకి ‘రేవ్‌’.. అందుకే ప్రముఖులంతా బెంగళూరులో పార్టీలు

సందర్భం ఏదైనా మత్తులో మునిగి తేలాలి. కిక్‌ ఎక్కించే డ్రగ్స్‌ను ఆస్వాదించాలి. కొత్త ఆనందాలను జుర్రుకోవాలి. వేలంవెర్రిగా మారిన ఈ పార్టీ సంస్కృతి వయో బేధం లేకుండా మాదకద్రవ్యాలను దగ్గర చేస్తోంది.

Updated : 25 May 2024 11:43 IST

ఈవెంట్‌ నిర్వాహకులపై నగర  పోలీసుల గురి

ఈనాడు, హైదరాబాద్‌: సందర్భం ఏదైనా మత్తులో మునిగి తేలాలి. కిక్‌ ఎక్కించే డ్రగ్స్‌ను ఆస్వాదించాలి. కొత్త ఆనందాలను జుర్రుకోవాలి. వేలంవెర్రిగా మారిన ఈ పార్టీ సంస్కృతి వయో బేధం లేకుండా మాదకద్రవ్యాలను దగ్గర చేస్తోంది. ఇటీవల బెంగళూరులో రేవ్‌పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతోమంది ఆ వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్దారించారు. ఖరీదైన డ్రగ్స్‌ తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లోనూ గుర్తించారు. దీంతో ఒకప్పుడు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల్లో సాగిన రేవ్, ముజరారే పార్టీలకు బెంగళూరు వేదికగా మారటం చర్చనీయాంశంగా మారింది. కొద్దిసమయంలో భారీఎత్తున డబ్బు సంపాదించేందుకు కొన్ని ఈవెంట్‌ సంస్థలు, కొందరు డీజేలు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మలచుకున్నట్టు నగర పోలీసులు అంచనాకు వచ్చారు. గోవా, హైదరాబాద్‌ల్లో టీఎస్‌ న్యాబ్‌ నిఘా పెరగటంతో రూటు మార్చారు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్న ఈవెంట్స్‌ నిర్వాహకులపై కన్నేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీరిచ్చే సమాచారంతో మరో డ్రగ్‌ డాన్‌ ఆట కట్టించేందుకు నగర పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

బెంగళూరే ఎందుకంటే..

అధికశాతం పబ్‌లు, రిసార్ట్స్, ఫాంహౌస్‌లు.. చీకటి కార్యకలాపాలకు కేరాఫ్‌ చిరునామా. రేవ్‌పార్టీల్లో హోరెత్తించే సంగీతం.. అలసిపోకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నారు. ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, పుణె, కోల్‌కతా, బంగ్లాదేశ్, ఉక్రెయిన్‌ తదితర ప్రాంతాల నుంచి అందమైన యువతులను పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆహ్వానిస్తున్నారు. తలకెక్కిన మత్తులో నృత్యాలు చేస్తూ ఇష్టానుసారంగా ఉండటమే రేవ్‌పార్టీ ప్రత్యేకత. కొందరు మరో అడుగు ముందుకేసి హిజ్రాలను తీసుకొచ్చి ముజ్రా పేరుతో వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరుకు వేదికను మార్చారు. అక్కడ నైజీరియన్ల నుంచి తేలికగా డ్రగ్స్‌ లభిస్తుండటంతో ఈవెంట్‌ నిర్వాహకులు దాన్ని కేంద్రంగా మార్చుకున్నారని నగరానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, బ్యాచిలర్‌ వేడుకల ముసుగులో ఈ కార్యకలాపాలు సాగిస్తుండటంతో పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. దీన్ని అనువుగా మలచుకొని 6 నెలలుగా డ్రగ్స్‌ పార్టీలను నిర్వహిస్తున్నారు. దీనికోసం గ్లామర్‌ కోసం సినీ, బుల్లితెర నటులకు రూ.లక్షల్లో అడ్వాన్స్‌లు ఇచ్చి అతిథులుగా రప్పించుకుంటున్నారని సైబరాబాద్‌కు చెందిన ఓ పోలిస్‌ అధికారి వివరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు