logo

Hyderabad: భర్తను మటన్‌, మల్లెపూలకు బయటకు పంపించానని నమ్మబలికి..

ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఏడేళ్ల దాంపత్య జీవితం సాఫీగా సాగింది. భార్య విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కింది. కల్లు, మద్యం తాగుతూ ఇతర వ్యసనాలకు బానిసైంది.

Updated : 08 Feb 2023 10:47 IST

బాలికతో కలిసి భార్య ఘాతుకం?
ఇంటి ముందు మృతదేహాన్ని వదిలేసి..

జీడిమెట్ల (హైదరాబాద్‌), న్యూస్‌టుడే : ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఏడేళ్ల దాంపత్య జీవితం సాఫీగా సాగింది. భార్య విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కింది. కల్లు, మద్యం తాగుతూ ఇతర వ్యసనాలకు బానిసైంది. భర్తకు ఓ బాలిక(17)తో రహస్యంగా పెళ్లి చేసింది.. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగింది. బాలిక దగ్గరయిందని భావించిన భర్త తనను వదిలించుకోవాలని ఎత్తులు వేయడంతో..భార్య అదే బాలికతో కలిసి అతన్ని దారుణంగా హతమార్చింది. సోమవారం జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్‌ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు..

భర్త మెప్పు కోసం బాలికతో పెళ్లి?

సోమవారం హత్యకు గురైన సురేష్‌ (28)తో రేణుకకు 2016లో ప్రేమ వివాహం జరిగింది.  ఆమె క్రమంగా చెడువ్యసనాల బాట పట్టింది. నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద తిష్ఠ వేసేది. పరాయి వ్యక్తులతో మాటలు కలిపేదని ఆరోపణలున్నాయి. కొన్ని రోజుల క్రితం బహదూర్‌పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్‌ తండాకు చెందిన అనాథ బాలికతో మాట కలిసింది. ఇద్దరి మద్య పరిచయం పెరిగింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తమ ఇంటికి తీసుకొచ్చింది. 15 రోజులుగా అందరూ కలిసుంటున్నారు. భర్త మెప్పు పొందేందుకు ఇంట్లోనే రహస్యంగా బాలికతో అతనికి పెళ్లి చేసింది. అయితే బాలిక తనకు దగ్గరవ్వడంతో సురేష్‌.. రేణుకను వదిలించుకోవాలని చూసినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ముగ్గురూ కలిసి మద్యం తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను మెడకు బిగించి..  అటొకరు..ఇటొకరు గట్టిగా లాగడంతో ఊపిరాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని ఓ సంచిలో పెట్టి రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు రోడ్డుపై వదిలేశారు. నేరం నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లారు. చంపిన అనంతరం సురేష్‌ బంధువులకు ఫోన్లు చేసి, తినేందుకు మటన్‌, మల్లెపూలు తీసుకురావాలని అతనిని బయటకు పంపించానని, తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు వాపోయింది. ఏమీ తెలియనట్లు ఠాణాకు వెళ్లి విలపించింది. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు