logo

సికింద్రా‘బాధ’ చర్లపల్లితో ఉపశమనం

నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది.

Updated : 12 May 2023 08:15 IST

 ఏడాది చివరి నాటికి సేవలు
వేగంగా జరుగుతున్న పనులు

నిర్మాణంలో ఉన్న రైల్వే టెర్మినల్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ మూడు స్టేషన్ల నుంచి నిత్యం 443 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 235 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ 10 ప్లాట్‌ఫాంలున్నాయి. ప్రయాణికులు 1.80 లక్షలు. నిత్యం రద్దీగా కనిపించే ఈ స్టేషన్‌లో రైలెక్కాలన్నా.. దిగాలన్నా ఇబ్బందే. పండగలు, వేసవి సెలవులు వచ్చాయంటే ప్లాట్‌ఫామ్స్‌ ఖాళీగా ఉండవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను బయటే ఆపాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమైన చర్లపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

చర్లపల్లిలో దిగి ఎంఎంటీఎస్‌లో నగరానికి

చర్లపల్లిలో శాటిలైట్‌ టర్మినల్‌ నిర్మించాలని ద.మ.రైల్వే భావించింది. రూ.300 కోట్లకుపైగా నిధుల అంచనాతో పనులు చేపట్టింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునర్నిర్మిస్తున్న తరుణంలో ఈ స్టేషన్‌ను ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేస్తారు. ఔటర్‌ రింగురోడ్డుకు చేరువలో ఉన్న ఈ స్టేషన్‌కు ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ స్టేషన్‌ నుంచి ప్రైవేటు రైళ్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫాంలు ప్యాసింజర్‌ రైళ్లకనుగుణంగా నిర్మించారు. ప్రయాణికులు చర్లపల్లిలో దిగి ఔటర్‌ మీదుగా లేదా రెండోదశలో అందుబాటులోకి వచ్చే ఎంఎంటీఎస్‌ ద్వారా నగరానికి రావచ్చు. దీంతో ఎంఎంటీఎస్‌ల ద్వారా చర్లపల్లికి రాకపోకలు సులభమవుతుంది. మౌలాలి నుంచి చర్లపల్లి మీదుగా ఘట్‌కేసర్‌కు ప్రత్యేకంగా ఎంఎంటీఎస్‌లకు రెండు లైన్లున్నాయి. దీంతో ఆ మార్గంలో 4 లైన్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ నుంచి మౌలాలికి రెండు లైన్లుండడమే సమస్య కాబోతుంది.

అందుబాటులోకి రానున్న సౌకర్యాలు..

* రెండు సబ్‌వేలు. వీటిద్వారా ఇరువైపులా వాహనాల్లో ప్లాట్‌ఫాంలకు చేరుకునే వెసులుబాటు
* విశాలమైన 2 ఐల్యాండ్‌ ప్లాట్‌ఫాంలు
* ప్రస్తుత ప్లాట్‌ఫాంల పొడవు పెంచడంతోపాటు మరిన్నింటి నిర్మాణం
* కొన్ని రైళ్ల నిర్వహణకు యార్డు
* అన్ని ప్లాట్‌ఫాంలకు నీరందేలా 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్‌ ట్యాంకు
* కొత్త స్టేషన్‌ భవనం
* స్టేషన్‌ ఆవరణతోపాటు స్టేషన్‌కు అనుసంధానం ఉండేలా సీసీ రహదారులు
* సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో సరిపడా కరెంటు సరఫరాకు ఏర్పాట్లు
* రైళ్ల నిర్వహణకు అనువైన షెడ్డు
* రెండు పాదచారుల వంతెనలు
* 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు
* 4 పిట్‌లైన్లు, పార్సిల్‌ బుకింగ్‌ కార్యాలయం
* ప్లాట్‌ఫాంలపై బయో మరుగుదొడ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని