logo

సైబర్‌ నేరగాళ్లకు ఆ ఖాతాదారులే లక్ష్యం

సైబర్‌ నేరగాళ్లు కొన్ని బ్యాంకుల ఖాతాదారుల్నే లక్ష్యంగా చేసుకోవడం కలవరపెడుతోంది.

Published : 12 Apr 2024 02:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు కొన్ని బ్యాంకుల ఖాతాదారుల్నే లక్ష్యంగా చేసుకోవడం కలవరపెడుతోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని రెండు అతి పెద్ద బ్యాంకులకు చెందిన ఖాతాదారులే ఎక్కువగా వీరి బారిన పడుతున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ సేఫ్‌ సంస్థ గతేడాది అక్టోబరులో ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ పేరుతో జరిగిన మోసాలను విశ్లేషించింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఖాతాదారులుండే ఎస్బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తొలిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉంది. 2023 అక్టోబరులో దేశవ్యాప్తంగా 8,760 మోసాలు జరగ్గా అందులో 2,624 మంది ఎస్బీఐ, 1,299 మంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులున్నారు. సుమారు 45 శాతం ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులే లక్ష్యంగా సైబర్‌ మోసాలు జరిగినట్లు తేలింది.

డేటా నిర్వహణలో డొల్లతనం.. ఈ రెండు బ్యాంకుల ఖాతాదారుల్ని లక్ష్యం చేసుకోవడానికి డేటా నిర్వహణలో డొల్లతనమే కారణం. బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలో ఈ-కేవైసీ కోసం ఆధార్‌, పాన్‌, వ్యక్తిగత చిరునామా, ఫోన్‌ నంబర్లు వంటి డేటా అంతా ఇస్తారు. ఈ వివరాలు బయటకు వెళ్లకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది జరగడం లేదు. కొందరు ఇంటి దొంగలు ఒక్కొక్కరి డేటాకు ధర నిర్ణయించి సైబర్‌ నేరగాళ్లకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు మోసపోవడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా ఉండడమేనని అధికారులు చెబుతున్నారు.

డ్రగ్స్‌ పార్శిల్‌ కేసులన్నీ ప్రైవేటువే!.. ఇటీవల కాలంలో ఈడీ, సీబీఐ, కస్టమ్స్‌ అధికారుల్లా మాట్లాడుతూ డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చిందంటూ డబ్బు వసూలు చేస్తున్న కేసుల్లో బాధితులు ఎక్కువగా ప్రైవేటు ఖాతాదారులు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు డేటా నిర్వహణ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సేవలకు సంబంధించి కాల్‌ సెంటర్ల నిర్వహణ వంటివి తృతీయ పక్ష సంస్థలు (థర్డ్‌ పార్టీ) చూస్తుంటాయి. ఇక్కడి నుంచే ఖాతాదారుల వివరాలు బయటకు చేరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని