logo

తాళాలు పగులగొట్టి.. మూడిళ్లలో చోరీ

మూడిళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Updated : 12 Apr 2024 05:36 IST

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి

తుర్కయంజాల్‌ పురపాలిక, న్యూస్‌టుడే: మూడిళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ మన్నెగూడ ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలో ఇరుగు పొరుగు అయిన సామల ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌.. తమ ఇళ్లకు తాళంపెట్టి కుటుంబసభ్యులతో కలిసి ఎవరికివారు వారి ఇళ్ల డాబాపై నిద్రించారు. అదేకాలనీలో వడ్డెర శ్రీరాములు 20రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లాడు. ఈక్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు.. మొదట శేఖర్‌ ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు రూ.10 తులాల బంగారం, రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న శ్రీరాములు ఇంట్లో సుమారు రూ.40తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు.


భార్యను భయపెట్టేందుకు.. పెట్రోల్‌ పోసుకొని

46 రోజులుగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జీడిమెట్ల, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడం లేదని భర్త భయపెట్టాలనుకున్నాడు. పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటిస్తే భయపడి వెంటనే వస్తుందనుకున్నాడు. ఆవేశంలో నిప్పంటించుకుని 46 రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలాడు. జీడిమెట్ల ఎస్సై ముంత ఆంజనేయులు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ వాసి మంగలి సురేశ్‌(29), స్వప్న దంపతులు ఉపాధికి వలస వచ్చి గాజులరామారంలో ఉండేవారు. ఓ అపార్టుమెంట్‌లో కాపలాదారుడిగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో కార్పెంటర్‌గా చేసేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వప్న చెల్లెలు మృతిచెందడంతో ఆమె గ్రామానికి వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో సురేశ్‌ కంకోల్‌కు వెళ్లాడు. నగరంలో వద్దని గ్రామానికే రావాలని భార్యకు సూచించాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఫిబ్రవరి 26న గాజులరామారం రాగా భార్యతోపాటు అత్త, మామ  ఉండటం చూసి గొడవపడ్డాడు. తనతో గ్రామానికి రాకుంటే చస్తానంటూ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


మద్యం మత్తులో రోడ్డెక్కి.. బస్సును ఢీకొట్టి

జీడిమెట్ల: లారీ డ్రైవర్‌ పట్టపగలు మద్యం తాగాడు. వేగంగా నడిపి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. గురువారం మధ్యాహ్నం జీడిమెట్ల ఆర్టీసీ డిపో బస్సు డిపో సమీపంలోని బస్టాప్‌లో ప్రయాణికుల కోసం ఆగింది. ఆ సమయంలో సూరారం ప్రధాన రహదారిలో సిమెంట్‌ లోడ్‌తో వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ఓ ప్రయాణికురాలి కాలు బెణికంది.


మృత శిశువును పీక్కుతిన్న వీధి కుక్కలు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: మృత శిశువును వీధి కుక్కలు సగ భాగం పీక్కుతిన్న ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. రామంతాపూర్‌ ప్రాంతంలోని నెహ్రూనగర్‌లో గురువారం ఓ వీధి కుక్క మృత శిశువు(మగ)ను నోట కరుచుకొని తెచ్చి అక్కడున్న కాలేజీ సమీపంలో వదిలేసిపోయింది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించగా మృత శిశువు తొంటి నుంచి కింది భాగం లేదు. కుక్కలు ఆ భాగం తిన్నాకనే వదిలేసిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిశువు పుట్టి, మృతిచెంది 2, 3 రోజులై ఉంటుందని ఎస్సై తెలిపారు. శిశువు పుట్టి మరణించాకనే తెచ్చి చెత్త డబ్బాలో వేసి ఉంటే వీధి కుక్కలు తీసి ఉండొచ్చని చెప్పారు.


సుమో బీభత్సం.. ఆటోడ్రైవర్‌ మృతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెల్లారితే రంజాన్‌ ప్రార్థనలకు వెళ్లాల్సిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. లిబర్టీ కూడలిలో టాటా సుమో సృష్టించిన బీభత్సంలో ఓ ఆటోడ్రైవర్‌ మృతి చెందాడు. నారాయణగూడ అడ్మిన్‌ ఎస్సై నరేష్‌కుమార్‌ వివరాల మేరకు.. పాతబస్తీ భవానీనగర్‌ తలాబ్‌కట్ట హిదాయత్‌ ఫంక్షన్‌ హాల్‌ లేన్‌లో ఉండే హసన్‌ బిన్‌ జాఫర్‌ ఈవెంట్‌ మేనేజర్‌. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద ఓ వేడుక ముగించుకొని, డెకరేషన్‌ వస్తువులను తలాబ్‌కట్ట, ఒవైసీ స్కూల్‌ వద్ద ఉండే ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ అఖీబ్‌ ఉర్‌ రహెమాన్‌ ఆటోలో వేసుకొని బయలుదేరాడు. లిబర్టీ కూడలిలో ఆటో నిలిపి నీళ్ల సీసా కొనుక్కోవడానికి లిబర్టీకి ఎదురు రోడ్డులో పాన్‌షాప్‌ వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా టాటా సుమో.. రహెమాన్‌ను, మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి నేరుగా ఓ దుకాణం షట్టర్‌ వైపు దూసుకెళ్లింది. అక్కడి నుంచి సుమో డ్రైవర్‌ రివర్స్‌ తీసుకుంటుండగా రోడ్డుపై గాయాలతో పడి ఉన్న రహెమాన్‌పై నుంచి వెళ్లింది. సుమో డ్రైవర్‌ ముస్తాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది ఓ ఉర్దూ దినపత్రికకు సంబంధించినది. రహెమాన్‌ను ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.


పోలీసు విచారణకు శివానందరెడ్డి హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: బుద్వేల్‌లో 26 ఎకరాల అసైన్డు భూముల వ్యవహారంలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా తెదేపా నేత, వెస్సెల్లా గ్రూపు సీఈవో మాండ్ర శివానందరెడ్డి నగర సీసీఎస్‌ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ఏప్రిల్‌ 2న విచారణకు హాజరయ్యారు. సంస్థకు సంబంధించి ముఖ్య వ్యవహారాలన్నీ శివానందరెడ్డి చూస్తారని వారు పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు శివానందరెడ్డితో పాటు ఆరోగ్యంరెడ్డికి నోటీసులిచ్చారు. శివానందరెడ్డి బుధవారం విచారణకు హాజరయ్యారు.


రూ.1,15,460 స్వాధీనం

బషీరాబాద్‌ న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న నగదు రూ.1,15,460 లను జప్తు చేసినట్లు బషీరాబాద్‌ ఎస్సై రమేష్‌ కుమార్‌ తెలిపారు. బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద గురువారం హెడ్‌ కానిస్టేబుల్‌ లోక్యా నాయక్‌, కానిస్టేబుల్‌ రాములు విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం షాదీపూర్‌కు చెందిన పటేల్‌ మనోజ్‌ కుమార్‌ ద్విచక్ర వాహనంపై వస్తుండగా తనిఖీలు చేసిన పోలీసులు ఆయన వద్ద ఎక్కువ నగదును గమనించి విషయాన్ని ఎస్‌ఐకి వివరించారు. మొత్తం రూ.1,15,460 ఉండగా జప్తు చేసి వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని గ్రీవెన్స్‌ సెల్‌కు పంపించడం జరిగిందని తెలిపారు.


24 గ్రాముల హెరాయిన్‌ పట్టివేత

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ బృందం, బాలాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన లాల్‌బాబు కుమార్‌(28).. మహ్మద్‌ ముస్తాక్‌(26)తో కలిసి సైదాబాద్‌లో ఉంటున్నారు. డీజే సౌండ్‌ సిస్ట్‌మ్‌లో పనిచేస్తారు. ఎంత కష్టపడినా ఆదాయం పెద్దగా ఉండట్లేదని.. లాల్‌బాబు కుమార్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేసి విక్రయించాలని ఆలోచన చేశాడు. మిత్రుడు ముస్తాక్‌ వద్ద డబ్బులు తీసుకుని స్వస్థలానికి వెళ్లాడు. తెలిసిన పప్పు కుస్వాల్‌ వద్ద డ్రగ్స్‌ సరఫరా చేసే మధ్యవర్తిని కలిశాడు. అదే రాష్ట్రంలో నివసించే అస్లం అనే వ్యక్తి వద్ద రూ.5 వేలకు గ్రాము చొప్పున 24 గ్రాములు హెరాయిన్‌ కొనుగోలు చేశాడు. నగరానికి వచ్చి మిత్రుడు ముస్తాక్‌తో కలిసి గ్రాము.. రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు స్థానిక మధ్యవర్తులతో మాట్లాడటానికి ఈనెల 9న బాలాపూర్‌ శివాజీచౌక్‌కు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు.. దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పప్పు కుస్వాల్‌, అస్లం అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


విమానాశ్రయంలో హిజ్రాల అసభ్య ప్రవర్తన

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయంలో అకారణంగా హల్‌చల్‌ చేసిన ఇద్దరు హిజ్రాల(ట్రాన్స్‌జెండర్స్‌)ను ఆర్జీఐఏ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు హిజ్రాలు శంషాబాద్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వడోదర వెళ్లడానికి  విమానాశ్రయానికి వచ్చారు. అదే సమయంలో జయపుర వెళ్లడానికి భద్రతాధికారుల తనిఖీల కోసం క్యూలైన్‌లో నిలుచున్న ఆస్ట్రేలియా దేశస్థులతో హిజ్రాలు గొడవ పడ్డారు. విమానాశ్రయంలో అసభ్య పదజాలంతో హంగామా చేయడంతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని