logo

చేవెళ్లలో భాజపా జెండా ఎగరడం ఖాయం: కొండా

లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 12 Apr 2024 02:50 IST

కందవాడలో కార్యకర్తలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల, మొయినాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం ఆయన చేవెళ్ల, మొయినాబాద్‌, శంషాబాద్‌ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి ప్రజలంతా మోదీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు చెప్పారు. అవినీతి, అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పూటకో పార్టీమారిన నేతలు ప్రజలకు మేలు చేయలేరన్నారు. లోక్‌సభ నియోజకవర్గంలోని సమస్యలు తనకు తెలుసని, కేంద్రంలో ఎలాగూ ఎన్డీయే సర్కారే రానుండటంతో.. ఇక్కడి అభివృద్ధిని తన బాధ్యతగా తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. బీజాపూర్‌ రహదారి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసినా అప్పటి భారాస ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. మొదటి ప్రాధాన్యతగా ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తానన్నారు. ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రత్నం తదితర స్థానిక నేతలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని