logo

చోరీల కట్టడికి ప్రత్యేక నిఘా

వచ్చేది పార్లమెంటు ఎన్నికలు. సమయం పెద్దగా లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎండా కాలం సెలవులు కారణంగా కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తున్నారు.

Published : 12 Apr 2024 02:54 IST

ఎస్పీ కోటిరెడ్డి

న్యూస్‌టుడే, వికారాబాద్‌: వచ్చేది పార్లమెంటు ఎన్నికలు. సమయం పెద్దగా లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎండా కాలం సెలవులు కారణంగా కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చెలరేగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీస్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడంతోపాటు, చోరీల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సక్రమ నిర్వహణకు, శాంతి భద్రతల నిర్వహణకు పోలీస్‌ యంత్రాంగం ఏంచేయబోతోందనే విషయమై ఆయనతో ‘న్యూస్‌టుడే’ ‘ముఖాముఖి’ నిర్వహించింది.ఆ వివరాలు..

న్యూస్‌టుడే: దొంగతనాల నివారణకు కార్యాచరణ ఏమిటి?

ఎస్పీ: వేసవిలో అధికంగా చోరీలు జరిగే ఆస్కారం ఉంది. అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. రాత్రిపూట గస్తీ పెంచి ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశా. జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 26 చోరీలు జరిగి రూ.22.5 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇందులో రూ.18 లక్షలు స్వాధీనం(రికవరీ) చేశాం. ప్రజలు తమవంతుగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అనుమానితులు, అపరిచితులపై నిఘా పెట్టి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

న్యూ: సమస్యాత్మక కేంద్రాల్లో తీసుకోనున్న చర్యలేమిటి?

ఎస్పీ: జిల్లాలోని పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో 155 సమస్య, 46 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. గతంలో జరిగిన ఎన్నికల్లో అల్లర్లు, గొడవల ఆధారంగా తీవ్రతను బట్టి పోలింగ్‌ కేంద్రాలను సమస్య, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం.

న్యూ: పోలీస్‌ నిఘా ఎలా పటిష్ఠం చేస్తారు?

ఎస్పీ : సమస్య, అతి సమస్యాత్మక కేంద్రాలపై పోలీసు నిఘా వర్గాలు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు ఏవైనా పోలింగ్‌ నాటికి బహిర్గతమై గొడవలు చెలరేగే అవకాశాలున్నాయా? అనే వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎన్నికల విధుల్లో 1,600 మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పాల్గొంటాయి.  సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెట్టింపు భద్రత ఏర్పాటు చేయనున్నాం. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్‌ కమాండ్‌ కేంద్రానికి అనుసంధానించడంతో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించనున్నాం. ఎన్నికలు సజావుగా సాగడానికి ప్రతి విషయంపైనా దృష్టి కేంద్రీకరించాం.  

న్యూ: నేర చరితులకు ఎలా అడ్డుకట్ట వేస్తారు?

ఎస్పీ : ఇంకా నేర ప్రవృత్తి వీడని, తరచూ గొడవలు పడుతున్న వారి జాబితాలను ఇప్పటికే రూపొందించాం. గత శాసనసభ ఎన్నికల్లో 2,500 మందిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశాం. ప్రస్తుతం 180 మందిని బైండోవర్‌ చేశాం. 393 మంది రౌడీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాం. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసు దస్త్రాలను పరిశీలించి నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని