logo

రైలు బండి.. గంజాయి దండి

కోట్లాది మందిని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి  గుప్పుమంటోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు.. ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు..

Published : 12 Apr 2024 02:57 IST

ఈనాడు- హైదరాబాద్‌

గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు

కోట్లాది మందిని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి  గుప్పుమంటోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు.. ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు.. వెరసి ఏటా గంజాయి రవాణా పెరుగుతోంది. రహదారుల్లో పోలీసుల తనిఖీలు పెరగడం, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ఏర్పాటుతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఇటీవల గంజాయికి డిమాండ్‌ పెరగడం మరో కారణం. ఆర్పీఎఫ్‌, జీఆర్పీబృందాల తనిఖీల్లో సరకు చిక్కుతున్నా.. రవాణాఅయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు.

చిన్న స్టేషన్లు కేంద్రంగా

చిన్న రైల్వేస్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్టాపులు, పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే అంతర్రాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడా పోలీసు తనిఖీలు తప్పవు. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు.. నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతుంటాయి. కొన్నిసార్లు రూట్‌ క్లియరెన్స్‌ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు ఏవోబీ సరిహద్దులు, ఒడిశా, ఇతర రాష్ట్రాలనుంచి గంజాయి తీసుకొచ్చేవారు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడవరకూ రాకుండా శివార్లలోని చిన్నస్టేషన్లలో దిగుతారు. ఇక్కడ తనిఖీలు ఉండకపోవడం.. అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేర్వేరు బోగీల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమోస్తే సరకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగీల్లోకి మారుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారని పోలీసులు పేర్కొన్నారు.

ఏవోబీ టూ హైదరాబాద్‌

ఇప్పటివరకూ స్మగ్లర్లు, మధ్యవర్తులే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కేవారు. ఇటీవల ఏవోబీ, ఒడిశా ప్రాంతాల స్థానికులు, రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు. ఏవోబీ దగ్గర గంజాయి కిలో రూ.3 వేలుంటే.. నగరంలో రూ.30-50వేలు పలుకుతోంది. హ్యాష్‌ ఆయిల్‌గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది. దీంతో మధ్యవర్తులతో సంబంధం లేకుండా వారే నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చినవారు.. తమతోపాటే సరకు తీసుకొస్తున్నారు. ఇటీవల చందానగర్‌లో ఆబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టుచేశారు. ఏవోబీ ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు. డబ్బుకోసం అప్పుడప్పుడూ రైల్లో వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. మరోవైపు మహిళలతోనూ స్మగ్లర్లు గంజాయి రవాణా చేయిస్తున్నారు. గతేడాది రైళ్లలో గంజాయి తరలిస్తుండగా అరెస్టుయిన వారిలో 12 మంది మహిళలున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని