logo

చెట్లకు తిరిగి ప్రాణం పోస్తున్నాడు

రహదారులు అభివృద్ధి సూచికలు.. దశాబ్దాలుగా ఎంతో మందికి, జీవజాతులకు చల్లటి నీడనిచ్చిన చెట్లు వాటి నిర్మాణానికి అడ్డొస్తే ఎప్పటికీ అవి నిరోధకాలు కావంటూ ప్రచారం చేస్తున్నారు జూబ్లీహిల్స్‌కి చెందిన ఉదయ్‌క్రిష్ణ.

Updated : 12 Apr 2024 05:30 IST

వట ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌కృష్ణ కృషి
ఈనాడు, హైదరాబాద్‌

రహదారులు అభివృద్ధి సూచికలు.. దశాబ్దాలుగా ఎంతో మందికి, జీవజాతులకు చల్లటి నీడనిచ్చిన చెట్లు వాటి నిర్మాణానికి అడ్డొస్తే ఎప్పటికీ అవి నిరోధకాలు కావంటూ ప్రచారం చేస్తున్నారు జూబ్లీహిల్స్‌కి చెందిన ఉదయ్‌క్రిష్ణ. వందల ఏళ్లనాటి చెట్లయినా మరోచోటికి తరలించి (ట్రాన్స్‌లొకేషన్‌ ద్వారా) వాటికి పునరుజ్జీవం ఇవ్వొచ్చని నిరూపిస్తూ పర్యావరణహిత ప్రయాణం మొదలుపెట్టారు.  

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి.. నాలుగేళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన ఉదయ్‌కృష్ణ 2001లో స్వదేశానికి తిరిగొచ్చారు. 2010లో కూకట్‌పల్లిలో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించే సమయంలో 16 చెట్లను కొట్టేయాల్సి వచ్చింది. అప్పుడే ఆ చెట్లను మరోచోటికి తరలిస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన ఉదయ్‌కృష్ణ అక్కడే ఉన్న స్థానికులను ఒప్పించి అక్కడ నాటించారు. అందులో 13  బతకడంతో మరిన్ని చెట్లకు ప్రాణం పోయాలని అప్పుడే సంకల్పించుకున్నారు. ట్రీప్రొటెక్షన్‌ కమిటీ, దాని విధివిధానాల గురించి తెలుసుకొని ఉచితంగా ట్రీట్రాన్స్‌లొకేషన్‌కు ‘వట ఫౌండేషన్‌’ ప్రారంభించారు. ‘ట్రాన్స్‌లొకేషన్‌’, ‘సేవ్‌ ది టైగర్‌’, ‘టైగర్‌ కారిడార్‌’ వంటి లక్ష్యాలతో పని చేస్తోంది. చెట్ల తరలింపునకు భారీ క్రేన్లు, ట్రక్కులు, పనిముట్లతో పాటు రూ.3వేల నుంచి రూ.3లక్షలు ఖర్చవుతాయి. వ్యయాన్ని క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరిస్తున్నారు. నగరంలో 3వేలకు పైగా భారీ చెట్లతోపాటు ఇతర రాష్ట్రాల్లో 10వేల చెట్లకు తిరిగి ప్రాణం పోశారు. ఇందులో 90, 100 ఏళ్లకు పైబడిన వృక్షాలు ఉన్నాయి. గోవా, మచిలీపట్నం, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, భోపాల్‌లో తుఫానుకు పడిపోయిన చెట్లకు సైతం తిరిగి ప్రాణం పోశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని