logo

ఎంఐఎం తోడ్పాటు ఎవరికో..?

రాజధాని పరిధిలోని పాతబస్తీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం పార్టీ ఏ పార్టీకి సన్నిహితంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Published : 12 Apr 2024 03:09 IST

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని పరిధిలోని పాతబస్తీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం పార్టీ ఏ పార్టీకి సన్నిహితంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పార్టీ ఎవరితో సన్నిహిత సంబంధాలు నెరపుతుందో ఆ పార్టీకే రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలో మైనార్టీ ఓటర్లు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కొందరు నేతలు భావిస్తున్నారు. పదేళ్లుగా భారాసతో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వారం రోజుల వ్యవధిలోనే దీనిపై ఎంఐఎం ఒక నిర్ణయానికి రాబోతుందని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితంగా ఉంటే తాము గెలిచిన నియోజకవర్గాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి మద్దతుగా ఎంఐఎం నిల్చింది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన గత రెండు ఎన్నికల్లోనూ భారాసకు తోడుగా ఉంది. కొద్ది నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లోనే ఎంఐఎం బరిలో ఉంది. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గోషామహల్‌లో తప్ప మిగిలిన ఆరు చోట్ల పోటీ చేసింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో నాంపల్లి, జూబ్లీహిల్స్‌లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. చేవెళ్ల పరిధిలో రాజేంద్రనగర్‌లో పోటీ చేసింది. గోషామహల్‌లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నా భారాస అభ్యర్థికి తోడ్పాటు ఇవ్వడం కోసమే అక్కడ పోటీ చేయలేదని చెబుతున్నారు.

కాంగ్రెస్‌కు సన్నిహితంగా..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. మొదట్లో ఒవైసీ సోదరులు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మారారు. సీఎం లండన్‌ పర్యటనలో అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆయన వెంట కనిపించారు. పాతబస్తీ మెట్రో పనులకు శంకుస్థాపన చేసిన సమయంలోనూ అసదుద్దీన్‌ ఒవైసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ స్థాయిలో ఈ రెండు పార్టీ నేతల మధ్య అనధికారికంగా చర్చలు జరిగాయని చెబుతున్నారు. దీనికి అనుగుణంగా లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం ఈసారి కాంగ్రెస్‌కు తోడ్పాటు అందించే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మిగిలిన లోక్‌సభ స్థానాల్లో పార్టీ తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని