logo

మరుగున పడినా ద్రువీకరిస్తాం

పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నట్లు, వాటిని మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ నుంచి శానిటరీ సర్టిఫికెట్‌ను తీసుకుని సమర్పించాలనే విద్యాశాఖ నిబంధనను కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 12 Apr 2024 03:11 IST

శానిటరీ సర్టిఫికెట్ల పేరుతో కొందరు అధికారుల దందా
ఒక్కో పాఠశాల నుంచి రూ.10వేలు వసూలు!

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నట్లు, వాటిని మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ నుంచి శానిటరీ సర్టిఫికెట్‌ను తీసుకుని సమర్పించాలనే విద్యాశాఖ నిబంధనను కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఆమ్యామ్యాలు సమర్పించిన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాల్ని ఇస్తున్నారు. విద్యాశాఖ అధికారులూ వాటిని గుడ్డిగా స్వీకరిస్తూ పాఠశాలల గుర్తింపును పొడిగిస్తున్నారు. ఇరుకు గదుల్లో నడుస్తున్న పాఠశాలల్లో సరైన మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో బాలికలు నరకం చూస్తున్నారు.

రూ.10వేల చొప్పున వసూళ్లు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలోని సహాయ వైద్యాధికారులు (ఏఎంఓహెచ్‌) పాఠశాలలకు పారిశుద్ధ్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. శానిటరీ సూపర్‌వైజర్లు(ఎస్‌ఎస్‌) తనిఖీ చేసి.. అంతా బాగుందని చెబితేనే సర్టిఫికెట్లు ఇస్తున్నామని ఏఎంఓహెచ్‌లు చెబుతున్నారు. కొందరు ఎస్‌ఎస్‌లు, వారి కింద పనిచేసే శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడుకుని ఏఎంఓహెచ్‌లకు సర్టిఫికెట్‌ ఇవ్వాలనే సిఫార్సులు పంపుతారు.

ఉదాహరణకు.. ముషీరాబాద్‌, అంబర్‌పేట సర్కిళ్లలో పారిశుద్ధ్య ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను కింది స్థాయిలో ఒకే అధికారి నిర్వహిస్తున్నారు. ఆయన ఒక్కో పాఠశాల నుంచి రూ.10వేలు తీసుకుంటారని, పై అధికారులకు రూ.4వేలు ఇస్తుంటారని తోటి సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. రాంనగర్‌, కవాడిగూడ, బోలక్‌పూర్‌ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని పాఠశాలలకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల జారీని ఆన్‌లైన్‌ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలో తీసిన మరుగుదొడ్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో పరిశీలించాకే ధ్రువీకరణపత్రం మంజూరయ్యేలా నిబంధన పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గుర్తింపుతో ముడిపడిన ఇతర పత్రాల్లోనూ.. అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారా, మెట్ల మార్గం.. నీటి ట్యాంకు సామర్థ్యం ఎంత తదితర విషయాల్లో పాఠశాల యాజమాన్యం తీసుకున్న చర్యలను పరిశీలించి జీహెచ్‌ఎంసీ లేదా అగ్నిమాపకశాఖ అధికారులు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. భవన నిర్మాణ సామర్థ్యం, మైదానాలు తదితర అంశాలను పాఠశాలల గుర్తింపును పొడిగించే సమయంలో, పాఠశాల స్థాయిని పెంచే క్రమంలో విద్యాశాఖ పరిశీలిస్తుంది. ఈ క్రమంలో  నకిలీ శానిటరీ సర్టిఫికెట్లు, ఫైర్‌ ఎన్వోసీలు తదితరాలు కొన్ని పాఠశాలలకు దన్నుగా నిలుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని