logo

మేలుకొనేలా.. మేలు జరిగేలా

గ్రేటర్‌ వ్యాప్తంగా వాన నీటి సంరక్షణ లేకపోవడంతో ఆ ప్రభావం బోర్లపై పడుతోంది.

Published : 12 Apr 2024 03:18 IST

ఇంకుడు గుంతలపై అవగాహనకు కార్యాచరణ
వాననీటి సంరక్షణ లేకే ఎండిపోతున్న బోర్లు
జలమండలి ఇంటింటా సర్వే షురూ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా వాన నీటి సంరక్షణ లేకపోవడంతో ఆ ప్రభావం బోర్లపై పడుతోంది. జలమండలి ఇటీవల చేసిన ఇంటింటా సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. దీంతో ఒక్కసారిగా ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా 31,706 మంది ట్యాంకర్ల కోసం జలమండలిని ఆశ్రయిస్తున్నారు. గతేడాది మార్చితో పోల్చితే అదనంగా 10 వేల కుటుంబాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నట్లు గుర్తించారు. పదేపదే తెప్పించుకుంటున్న దాదాపు 1700 ఇళ్లను జలమండలి సర్వే చేసింది. ఆయా వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్లలో వాన నీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు లేనట్లు తేలింది. కొన్ని అపార్ట్‌మెంట్లలో ఇంకుడు గుంతలు ఉన్నా నిర్వహణ వదిలేశారు. ఉదాహరణకు ఎస్‌ఆర్‌నగర్‌లో 149 ఇళ్లలో సర్వే చేస్తే 118 ఇళ్లలో వాననీటి సంరక్షణ చర్యలు లేవు. మణికొండ, మియాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలోనూ చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నుంచే బోర్లు పనిచేయడం లేదు.

ఇలా చేస్తారు...

  • పదే పదే ట్యాంకర్లు తెప్పించుకుంటున్న వారి డేటాను ఇప్పటికే జలమండలి అధికారులు సేకరించారు. వారి వద్దకు ఎన్‌జీవో ప్రతినిధులను పంపనున్నారు. ఇలా 31706 ఇళ్లను తిరిగి ఇంకుడు గుంతలు లేని వారికి నోటీసులు ఇస్తారు.
  • ఇంకుడు గుంత నిర్మించుకునేలా వారికి అవగాహన కల్పిస్తారు. అవసరమైతే జలమండలి ద్వారా సాంకేతిక సహకారం అందిస్తారు. రెండు నెలల్లో ఏర్పాటు చేసుకునేలా ఒప్పించనున్నారు. ఇప్పటికే 18 ఎన్‌జీవోలను ఈ కార్యకలాపాల కోసం జలమండలి ఎంపిక చేసింది. 
  • మరోవైపు బోర్లు పూర్తిగా ఎండిపోయిన అపార్ట్‌మెంట్లలో ఇంజక్షన్‌ వెల్‌ నిర్మించుకునేలా యజమానులను ఒప్పించనున్నారు.
  • వీటితోపాటు గతంలో జలమండలి ఎంపిక చేసిన కాలనీల్లో ఇంకుడు గుంతలు నిర్మించింది. వాటి నిర్వహణ కాలనీ సంఘాలు చేపట్టేలా ఒప్పందం చేసుకుంది. ఒక్కో గుంతకు రూ.లక్షకు పైనే ఖర్చు చేశారు. ప్రస్తుతం అవి ఎలాంటి నిర్వహణకు నోచుకోవడం లేదు. తాజాగా ఈ ఒప్పంద పత్రాలు బయటకు తీసి ఆయా కాలనీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని