logo

పారదర్శకతకు పెద్దపీట.. దళారులకు అడ్డుకట్ట

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొన్నేళ్లుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు తమ చాకచక్యాన్ని చూపుతున్నారన్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి.

Published : 13 Apr 2024 02:11 IST

ధాన్యం కొనుగోళ్లకు ఐరిస్‌ విధానం  

 అధికారుల అవగాహన కార్యక్రమం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొన్నేళ్లుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు తమ చాకచక్యాన్ని చూపుతున్నారన్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లను ఈసారి మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అవసరాలే ఆసరా చేసుకుంటున్నారని..

రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్రమాలను, దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం ఐరిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. డీఆర్‌డీఏ-ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీసీఎంఎస్‌లు, ఏఎంసీ, ద్వారా గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందనున్నారు.

  • కొన్ని చోట్ల దళారులు రైతుల అవసరాలను ఆసరా చేసుకుని ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. అదే ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో రైతుల పేరుతో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లను ఐరిస్‌ యంత్రాలను ఉపయోగించి కనుపాప ద్వారా లబ్ధిదారుల గుర్తింపు విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం నిర్వాహకులకు ఐరిస్‌ పరికరాలను పంపిణీచేశారు.

మూడో వారంలో ప్రారంభం

మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వరి ధాన్యం కోతకు కొంత ఆలస్యంగా వస్తుంది. జిల్లాలోని బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో వరి కోతలు ముందుగా ప్రారంభమవుతాయి. ఈ మండలాల్లో ఈనెల మూడో వారంలో కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొన్ని కేంద్రాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు.  జిల్లాలోని అన్ని కేంద్రాలు ఈనెల చివరి వారంలో కాని వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ప్రతి రైతు రావాల్సిందే..

గతంలో రైతుబంధు పాసుపుస్తకం, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ను అనుసంధానించారు. పాత పద్ధతి ప్రకారం ట్యాబ్‌లో నమోదు చేయగానే రైతుల ఫోన్‌కు వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వచ్చేది. ఈ సంఖ్యను నమోదు చేసి ధాన్యాన్ని కొనేవారు. దీనికి అదనంగా ఇప్పుడు కనుపాప గుర్తింపు తీసుకోనున్నారు. ఇందు కోసం ప్రతి రైతు కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

1,92,500 లక్షల టన్నుల లక్ష్యం

జిల్లాలో ఈ సీజన్‌లో 1,92,500 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా నిర్ణయించింది.

  • జిల్లా వ్యాప్తంగా 122 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో డీర్‌డీఏ-ఐకేపి 27, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్‌ల ద్వారా 27, ఏఎంసీ 3, ఎఫ్‌సీఓ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ఉంటాయి.  

కేంద్రానికి ఒకటి చొప్పున పంపిణీ:

రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

జిల్లాలో 122 వరి ధాన్యం కేంద్రాలను 122 ప్రారంభించనున్నాం. ప్రతి కేంద్రానికి ఒకటి చొప్పున ఐరిస్‌ యంత్రాలను పంపిణి చేశాం. నిర్వాహకులకు వీటిని ఏ విధంగా వినియోగించాలో తగిన శిక్షణ ఇచ్చాం. కేంద్రాల్లో వీటిని తప్పని సరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని