logo

పై వంతెన పనులు వేగవంతం

వికారాబాద్‌ మీదుగా పరిగి, హైదరాబాద్‌ వెళ్లేందుకు ఒకే పై వంతెన ఉండటంతో నిత్యం వాహనదారులకు  ఇబ్బందులు తప్పడం లేదు.ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు నెలల క్రితం నూతన వంతెన పనులు చేపట్టారు.

Published : 13 Apr 2024 02:17 IST

వాహనదారులకు తీరనున్న ఇక్కట్లు

కొనసాగుతున్న  నిర్మాణం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌: వికారాబాద్‌ మీదుగా పరిగి, హైదరాబాద్‌ వెళ్లేందుకు ఒకే పై వంతెన ఉండటంతో నిత్యం వాహనదారులకు  ఇబ్బందులు తప్పడం లేదు.ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు నెలల క్రితం నూతన వంతెన పనులు చేపట్టారు. ప్రస్తుతం వేసవి కావడంతో వేగంగా సాగుతున్నాయి. సకాలంలో పూర్తయితే పట్టణ వాసులకు, వాహనదారులకు రాకపోకలకు అవస్థలు తొలగుతాయి.

  • అన్నింటికీ కీలకం: ఎప్పుడో 1995-96లో అప్పటి వాహనాల రాకపోకలను అంచనా వేస్తూ వికారాబాద్‌ ఆరంభంలో పై వంతెన నిర్మించారు. రోజు రోజూకు వాహనాల సంఖ్య అధికం కావడం, జిల్లా కేంద్రం కావడంతోపాటు ఇక్కడే కలెక్టరేట్‌ కార్యాలయం ఉండటంతో పాటు అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పనుల నిమ్తితం వివిధ ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. అంతేకాదు హైదరాబాద్‌నుంచి వికారాబాద్‌ మీదుగా తాండూరు, ఇతర ప్రాంతాలకు, అలాగే అటు నుంచి హైదరాబాద్‌కు రావాలంటే ఈ వంతెనే కీలకం. వికారాబాద్‌ నుంచి తాండూరు, సదాశివపేట, నవాబుపేట తదితర ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో పట్టణ ప్రజలకు నిత్యం ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు గత భారాస ప్రభుత్వం నూతనంగా మరో పై వంతెన నిర్మాణానికి రూ.96 కోట్లను మంజూరు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తే, నిర్మాణ పనులు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై  వేగంగా సాగుతున్నాయి. 
  • సిమెంటు పిల్లర్లు: ప్రస్తుతం ఉన్న పాత వంతెన మట్టి కట్టపై నిర్మించినది. మధ్యలో రైల్వే ట్రాక్‌ ఉన్న చోట మామ్రే పిల్లర్లు ఉన్నాయి. దీని పక్కనే చేపట్టిన కొత్త వంతెనకు ఆర్‌ అండ్‌ బి అధికారులు సిమెంటు పిల్లర్లు వేస్తున్నారు. దీన్ని అందుబాటులోకి తెచ్చిన తరువాత పాత వంతెనకు కూడా మట్టి తొలగించి సిమెంటు పిల్లర్లు నిర్మిస్తారు. దీంతో రెండు వంతెనలు ప్రజలకు ఉపయోగపడతాయని, తద్వారా ట్రాఫిక్‌ సమస్య తొలగడంతోపాటు రాకపోకలు ఎంతో వేగంగా సులభంగా మారతాయని అధికారులు వివరిస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు

పై వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు  పర్యవేక్షిస్తున్నాం. సంబంధిత గుత్తేదారుకు ఇచ్చిన సమయంలోగా పూర్తి అయ్యేలా చూస్తున్నాం. సంవత్సరంలోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు వంతెన అందుబాటులోకి తీసుకువస్తాం.

శ్రీధర్‌రెడ్డి, అర్‌ అండ్‌ బీ డీఈ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని