logo

అగ్నిప్రమాదాల నివారణకు మాక్‌డ్రిల్‌

అగ్నిప్రమాదాల సంఖ్య అధికంగా నమోదవుతున్న రాజధానిలో వాటి నివారణ, ఘటన స్థలంలో తక్షణం  స్పందించేవారి పాత్ర కీలకం. ప్రమాదం జరిగినా ముప్పు నుంచి బయటపడేలా అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటల నుంచి తప్పించుకునే నైపుణ్యాలు అవసరం.

Published : 13 Apr 2024 02:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిప్రమాదాల సంఖ్య అధికంగా నమోదవుతున్న రాజధానిలో వాటి నివారణ, ఘటన స్థలంలో తక్షణం  స్పందించేవారి పాత్ర కీలకం. ప్రమాదం జరిగినా ముప్పు నుంచి బయటపడేలా అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటల నుంచి తప్పించుకునే నైపుణ్యాలు అవసరం. ఇందుకోసమే అగ్నిమాపకశాఖ ఫైర్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తోంది. అపార్ట్‌మెంట్లు, ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కార్యాలయాలు దరఖాస్తు చేసుకుంటే డ్రిల్స్‌ నిర్వహిస్తామని అగ్నిమాపకశాఖ చెబుతున్నా 50 శాతానికి మించి దరఖాస్తులు రావడం లేదు. అయినా ప్రతి శుక్రవారం ప్రమాదకర భవనాలను గుర్తిస్తున్న అధికారులు ఫైర్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. భవన యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తామని, ఫలితంగా ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అధికారులు సూచిస్తున్నారు.

ఎలా నిర్వహిస్తారు..: అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలను ఎలా ఆర్పాలి..? అగ్నిమాపక సామగ్రి ఎలా వినియోగించాలి ? అన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఫైర్‌వాటర్‌వ్యాన్‌ ద్వారా పైఅంతస్తుల వరకు నీటిని ఎలా వెదజల్లుతారో నమూనా ప్రదర్శన ద్వారా వివరిస్తారు. ప్రమాదం జరగ్గానే చుట్టుపక్కల ఉండేవారు గందరగోళానికి గురైతే వారిలో మనోధైర్యం నింపడం, బయటకు వెళ్లే మార్గాలు చూపి ప్రాణాలు ఎలా కాపాడవచ్చనే అంశాలను వివరిస్తారు. ఇందులో భాగంగా అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, మరమ్మతులు చేయించుకోవాల్సిన వాటి గురించి, బిల్డింగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా-2005 నిబంధనల పాటింపు, సూచనలు అందిస్తారు.  

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..

https://fire.telangana.gov.in/Home.aspx  వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘క్లిక్‌ ఆన్‌ మాక్‌డ్రిల్‌’పై క్లిక్‌ చేస్తే లాగిన్‌ పేజీ ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ ‘రిజిస్టర్‌’పై క్లిక్‌ చేస్తే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారి కోసం దరఖాస్తు వస్తుంది. పేరు, ఫోన్‌ నంబర్‌, చిరునామా, పిన్‌కోడ్‌ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేసి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ రూపొందించుకోవాలి. అనంతరం మరోసారి లాగిన్‌ పేజీకి వెళ్లి పాస్‌వర్డ్‌ యూజర్‌ ఐడీ ఇచ్చి లాగిన్‌ అవ్వాలి. అక్కడి డాష్‌బోర్డు పేజీలో మాక్‌డ్రిల్‌ అప్లికేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి పేరు, మాక్‌డ్రిల్‌ చేయాల్సిన ప్రదేశం చిరునామా, అది ప్రభుత్వ భవనమా..కాదా..? చెప్పాలి.(ప్రభుత్వ భవనమైతే  ఉచితంగా మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తారు. ప్రైవేట్‌ వ్యక్తులైతే నిర్దేశిత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి). ఈ-మెయిల్‌ ఐడీ, తేదీ వివరాలు సమర్పించాలి. అనంతరం డాష్‌బోర్డు పేజీలో స్టేటస్‌ను గమనిస్తే అక్‌నాలెడ్జ్‌ నంబర్‌ కేటాయించినట్లు, పేమెంట్‌ స్టేటస్‌ తెలుస్తుంది. పేమెంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రూ.5000 చెల్లించి అప్లికేషన్‌ సమర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు