logo

హైదర్‌నగర్‌ భూముల పరిరక్షణకు సిద్ధం

మియాపూర్‌ సమీపంలోని హైదర్‌నగర్‌లో ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. సర్వే నంబర్‌ 172లోని 196 ఎకరాల్లో 185 ఎకరాలను ప్రభుత్వపరం చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు న్యాయనిపుణులతో చర్చించారు.

Published : 13 Apr 2024 02:23 IST

మియాపూర్‌ సమీపంలోని స్థలాలు

ఈనాడు, హైదరాబాద్‌, కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: మియాపూర్‌ సమీపంలోని హైదర్‌నగర్‌లో ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. సర్వే నంబర్‌ 172లోని 196 ఎకరాల్లో 185 ఎకరాలను ప్రభుత్వపరం చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు న్యాయనిపుణులతో చర్చించారు. అంతకుముందు హైదర్‌నగర్‌ భూములు తమవేనంటూ దుర్గామాత హౌస్‌ బిల్డింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, ట్రినిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌, ఇతర కంపెనీలు సుప్రీంకోర్టులో మూడేళ్ల క్రితం వేర్వేరుగా స్పెషల్‌ లీవ్‌ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ భూములు ప్రభుత్వానివేనంటూ రెవెన్యూ అధికారులు పిటిషన్‌ వేశారు. వాటిలో కేవలం 11 ఎకరాల భూమి 1948 సంవత్సరానికి ముందు జాగిర్‌దారుల వద్ద కొన్న పట్టాదారులకు చెందుతుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుపై అప్పీలు చేయడానికి వీల్లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు హైదర్‌నగర్‌ భూముల అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నామని కూకట్‌పల్లి తహసీల్దార్‌ స్వామి తెలిపారు.   

విలువ రూ.7 వేల కోట్లు

ఆరు దశాబ్దాలకు పైగా వివాదాల్లో నలిగిన ఆ భూముల విలువ ప్రస్తుతం రూ.7 వేల కోట్లు ఉంటుంది. జాతీయ రహదారికి అనుకుని ఉండడం, స్థిరాస్తి వెంచర్లు, ఐటీ సంస్థలు సమీపంలో ఉండడంతో వీటి విలువ 15ఏళ్లలో కొన్నిరెట్లు పెరిగింది. వీటిని సొంతం చేసుకునేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేశారు. పైగా వారసులతోపాటు నిజాం వారసులు, జాగిర్దార్‌ల నుంచి కొన్నామంటూ వాదించారు. 1956లో నాంపల్లి కోర్టులో సివిల్‌ సూట్‌ వేశారు. భూముల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో నాంపల్లి కోర్టు సివిల్‌ సూట్‌ను హైకోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని విచారించి పైగా వంశస్తులకు అనుకూలంగా ప్రిలిమినరీ డిక్రీని 1963లో జారీ చేసింది. తుది తీర్పు రాకుండానే.. పైగా వంశస్తుల నుంచి కొన్ని సంస్థలు, హౌసింగ్‌ సొసైటీలు కొనుగోలు చేశాయి. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయగా అప్పటి నుంచి వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. ఈ భూములు ప్రైవేటు సంస్థలు, పైగా వారసులకు చెందినవి కావని, ప్రభుత్వానివీ కావంటూ హైకోర్టు నాలుగేళ్ల క్రితం ఉత్వర్వులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని