logo

మూసీ చుట్టూ మరిన్ని ఆంక్షలు

మూసీ నది ఒడ్డున నిర్మాణ అనుమతులపై మరిన్ని ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. మూసీ నది అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీఎల్‌) ఆ దిశగా చర్చలు జరుపుతోంది. ఎంఆర్‌డీసీఎల్‌ ఉన్నతాధికారులు, హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం వేర్వేరు ప్రతిపాదనలను సిద్ధం చేశాయని, వాటిని పురపాలకశాఖ పరిశీలిస్తోందని యంత్రాంగం తెలిపింది.

Published : 13 Apr 2024 02:28 IST

భవనాల ఎత్తు పరిమితిపై  చర్చలు
200-100 మీటర్ల వరకు అంటోన్న  ఎంఆర్‌డీసీఎల్‌

ఈనాడు, హైదరాబాద్‌: మూసీ నది ఒడ్డున నిర్మాణ అనుమతులపై మరిన్ని ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. మూసీ నది అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీఎల్‌) ఆ దిశగా చర్చలు జరుపుతోంది. ఎంఆర్‌డీసీఎల్‌ ఉన్నతాధికారులు, హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం వేర్వేరు ప్రతిపాదనలను సిద్ధం చేశాయని, వాటిని పురపాలకశాఖ పరిశీలిస్తోందని యంత్రాంగం తెలిపింది. నదికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించే సమయానికల్లా.. నిర్మాణ అనుమతుల విషయంలో నిర్ణయం జరగనుందని, ఆమేరకు బృహత్తర ప్రణాళికలో నిబంధనలను చేర్చుతామని వెల్లడించింది. నగరంలో నిర్మాణాల ఎత్తుపై ఎలాంటి పరిమితులు లేవు. సరిపడా స్థలం ఉంటే ఎన్ని అంతస్తులనైనా కట్టుకోవచ్చు. అయితే, మూసీ నదికి ఇరువైపులా ఎత్తును పరిమితం చేయాలని చర్చ జరుగుతోంది. నది అంచు నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించొద్దనేది అందులో ప్రధానమైనది. ప్రస్తుతం నది అంచు నుంచి 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉంది. అందులో నిర్మాణ అనుమతులను ఇవ్వకూడదనేది నిబంధన. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది అభివృద్ధికి చర్యలను ముమ్మరం చేయడంతో బఫర్‌జోన్‌లో ఒక్క అనుమతి కూడా మంజూరు కావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ నిర్ణయించారు. అదే సమయంలో ఎంఆర్‌డీసీఎల్‌ మరో 2 ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. మూసీ నుంచి 100 మీటర్ల వరకు అనుమతులను ఇవ్వొద్దని, అక్కడి నుంచి 200 మీటర్ల పరిధిలో భవనాల ఎత్తును పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

అమలుకు అనేక సవాళ్లు..

జంట జలాశయాల నుంచి మొదలయ్యే మూసీ నదిని తూర్పున ఓఆర్‌ఆర్‌ వరకు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. నదీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకం, వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి, తూర్పు, పశ్చిమాలను కలుపుతూ విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించాలని, నది పొడవునా పార్కులు, పచ్చదనం, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా ఎంఆర్‌డీసీఎల్‌ చర్యలు ప్రారంభించింది. నిర్మాణ అనుమతుల విషయంలో పలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. అయితే, బఫర్‌జోన్‌ను ప్రమాణికంగా తీసుకుంటేË నదిలో ఇప్పటికే 10 వేల నిర్మాణాలున్నాయి. వాటిని తొలగించి మౌలిక సౌకర్యాలను విస్తరించడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 200 మీటర్ల వరకు నిర్మాణ అనుమతుల విషయంలో పరిమితులను విధిస్తే అభివృద్ధి ప్రాజెక్టుపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని