logo

టపాసులు కాల్చొద్దు.. కర్రలు తేవద్దు

శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న నగరంలో శ్రీరాముని శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Updated : 13 Apr 2024 05:05 IST

శ్రీరాముడి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి

బేగంబజార్‌ ఛత్రి చౌరస్తాలో శోభాయాత్ర మార్గాన్ని పరిశీలిస్తున్న సీపీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్‌ తదితరులు

అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న నగరంలో శ్రీరాముని శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని.. శోభాయాత్రలో రాజకీయ చిహ్నాలు, అన్యమతస్థులను కించపరిచేలా పాటలు, ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేశారు. సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో భాగ్యనగర్‌ శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులతో శుక్రవారం సమావేశమయ్యారు. డిగ్రీ పరీక్షలు జరుగుతున్నందున డీజే శబ్దాలతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. శోభాయాత్రలో టపాసులు కాల్చడం, కర్రలు, మారణాయుధాలు వెంట తెచ్చుకోవడం నిషేధమన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాత్ర నిర్వహించాలన్నారు. భక్తులకు తాగునీరు, మొబైల్‌ టాయిలెట్స్‌, ఇతర వసతులు వివిధ విభాగాల తరఫున ఏర్పాటు చేస్తున్నారన్నారు. 7 కి.మీ. మేర మార్గాన్ని ఆయన ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు డా.భగవంత్‌రావు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు చేపట్టాల్సిన బందోబస్తుపై సీపీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌తో కూడా సమీక్ష నిర్వహించారు. ఊరేగింపులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు జరిగే ప్రధాన ఊరేగింపుతోపాటు నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోని వాటిపైనా దృష్టి సారించాలన్నారు. సీనియర్‌ అధికారుల ఆదేశాలు పాటించాలని.. డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు అందుకు తగ్గట్టుగా  ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని