logo

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఏఎస్‌ఐ మల్లేశం వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన తన్వీర్‌ఖాన్‌(27)కు మూడేళ్లక్రితం  వివాహమైంది.

Published : 14 Apr 2024 02:24 IST

కుత్బుల్లాపూర్‌: ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఏఎస్‌ఐ మల్లేశం వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన తన్వీర్‌ఖాన్‌(27)కు మూడేళ్లక్రితం  వివాహమైంది. పెళ్లికిముందే అతను మరో యువతిని ప్రేమించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతను ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. దీంతో మూడునెలల క్రితం దయానంద్‌నగర్‌లో తన మామ ఇంటికివచ్చి అద్దెకుంటూ పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గదిలోకి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో మామ, అనుమానంతో కిటికీ తెరచి చూడగా ఇనుప రాడ్‌కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


పారిశుద్ధ్య కార్మికుడిని రోడ్డున పడేశారు

అనుమానాస్పద స్థితిలో మృతి

నాచారం: మద్యం దుకాణంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకుంటే...ఆసుపత్రికి పంపించాల్సిన మద్యం పర్మిట్‌ రూం సిబ్బంది అతన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై పడేశారు. తెల్లవారేసరికి అపస్మారక స్థితిలో ఉన్న  కార్మికుడి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ఈ ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాలు ప్రకారం....నాచారం శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న ఎర్రబచ్చల కుమార్‌(45) జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడు. కాప్రా సర్కిల్‌ పరిధిలోని నాచారం బాబానగర్‌లో గత 20ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో మద్యం తాగేందుకు ఇంటి నుంచి బయలుదేరి నాచారం ప్రధాన రహదారిపై ఉన్న లిక్కర్‌ మార్ట్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్‌ రూంలో తాగాడు. కొద్దిసేపటికే పర్మిట్‌ రూంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో పర్మిట్‌ రూం సిబ్బంది.. పోలీసులకు గానీ, ఆసుపత్రికి గానీ తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేశారు. రాత్రి నుంచి అలానే పడి ఉండటంతో ఉదయం 7 గంటల సమయంలో స్థానికులు రోడ్డు పైన పడి ఉన్న వ్యక్తిని గుర్తించి పోలీసులకు, కుమార్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అతను మృతి చెందాడు. మద్యం దుకాణం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కుటుంబ సభ్యులు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.


సెలవని తండ్రితో నగరానికొచ్చి.. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ఆదిభట్ల, న్యూస్‌టుడే: సెలవు ఉండడంతో ఓ పాఠశాల విద్యార్థి హమాలీ అయిన తండ్రితోపాటు నగరానికొచ్చి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. తండ్రికి, డ్రైవర్‌కి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు. ఆదిభట్ల ఎస్సై వెంకటేష్‌ వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన హమాలీ అంబాజీ.. శుక్రవారం అదే ప్రాంతం నుంచి ఉల్లిగడ్డల లోడ్‌తో బొలేరో వాహనం డ్రైవర్‌ మిట్టల్‌తో పెద్దఅంబర్‌పేటలో అన్‌లోడ్‌ చేయడానికి వస్తున్నారు. ఆదివారం సెలవు ఉండడంతో ఆరోతరగతి చదువుతున్న కుమారుడు సామ్రాట్‌(13) వస్తాననడంతో సరేనన్నాడు. మిట్టల్‌ బొలేరోను నిర్లక్ష్యంగా నడిపి శనివారం తెల్లవారుజామున బొంగుళూరు ఎగ్జిట్‌ 12 సమీపంలోని ఓఆర్‌ఆర్‌ పక్కనున్న గ్రిల్‌ను డీకొట్టాడు. ఈ ప్రమాదంలో సామ్రాట్‌కు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిట్టల్‌కి, అంబాజీకి తీవ్ర గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని