logo

మాతృభాష తెలుగు.. ఉపాధి అవకాశాల్లో వెలుగు

విశ్వవిద్యాలయాల్లో బోధనా పద్ధతులు మారుతున్నా.. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఆంగ్లభాష వినియోగం పెరుగుతున్నా.. మాతృభాషలో పీజీ పూర్తిచేస్తే బోలెడు ఉపాధి అవకాశాలున్నాయని తెలుగు విశ్వవిద్యాలయం చెబుతోంది.

Updated : 14 Apr 2024 06:18 IST

డిగ్రీ, పీజీ ప్రవేశాలు  పెంచిన తెలుగు విశ్వవిద్యాలయం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో బోధనా పద్ధతులు మారుతున్నా.. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఆంగ్లభాష వినియోగం పెరుగుతున్నా.. మాతృభాషలో పీజీ పూర్తిచేస్తే బోలెడు ఉపాధి అవకాశాలున్నాయని తెలుగు విశ్వవిద్యాలయం చెబుతోంది. తెలుగులో పీజీ కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు వీలుగా ప్రవేశాల సంఖ్యనూ పెంచింది. ప్రస్తుతం 60మంది విద్యార్థులకు పీజీలో ప్రవేశాలు కల్పించింది. ఈ కోర్సు పూర్తితో మాతృభాషలో విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకునేందుకు దోహదపడుతుందని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ టి.కిషన్‌రావు వివరించారు.

విభిన్న రంగాలు.. ఉపాధి అవకాశాలు

తెలుగు పీజీవారికి నాలుగైదేళ్లుగా విభిన్నరంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల్లో మానవ వనరుల విభాగాలు, ఓటీటీ వేదికల్లో అవకాశాలు అధికమవుతున్నాయి. నాలుగైదు భాషల్లోకి ఓటీటీ వెబ్‌సిరీస్‌లను అనువదించేందుకు స్వచ్ఛమైన తెలుగుభాష తెలిసిన వారి కోసం వాటి నిర్వాహకులు అన్వేషిస్తున్నారు. ఆంగ్ల, హిందీల్లో ప్రముఖ డిజిటల్‌ మీడియాలు తెలుగు వెబ్‌సైట్లలో సమాచారం పొందుపరిచేందుకు క్లుప్తంగా భావం రాసేవారికి ప్రాధాన్యమిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న బహుళజాతి సంస్థల ద్వారా తెలుగు భాషలో పీజీ పూర్తిచేసిన విద్యార్థుల్లో 90శాతం మందికి ఉద్యోగాలు లభించాయి.

మాతృభాషపై ప్రేమతో కాకపోయినా..

ఇంటర్‌లో ఆంగ్ల మాధ్యమంలో గణితం, సైన్స్‌ సబ్జెక్టులు అర్థం చేసుకోలేని పిల్లల్లో 30శాతం మంది ఫెయిలవుతున్నారు. ఎలాగోలా పాసై మాతృభాషపై ప్రేమతో కాకపోయినా డిగ్రీలో తెలుగు మీడియంలో చరిత్ర, కామర్స్‌ వంటివి ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే సుమారు 90వేల మంది డిగ్రీలో చరిత్ర, కామర్స్‌, తెలుగు చదువుకుంటున్నారు. చరిత్ర, కామర్స్‌తో పోల్చితే తెలుగు భాషను డిగ్రీలో ప్రధానంగా ఎంచుకొని.. పీజీ పూర్తి చేస్తే చాలు.. అనంతరం భాషపై మరింత పట్టు పెంచుకునేందుకు పరిశోధనలు కొనసాగిస్తే తెలుగులో డాక్టరేట్‌గా పేరు పొందవచ్చు. డాక్టరేట్‌ పట్టా వచ్చాక పోటీ పరీక్షలు రాసేటప్పుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వేర్వేరు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు తెలుగు భాషలో సమాధానాలు రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు తెలిపారు. పీజీ కోర్సులో చేరుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోందని, డిజిటల్‌ మీడియాలో పీజీ డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని