logo

అధ్వానం.. అందుకే వెళ్లలేం

 పోలింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులు ఉండట్లేదని ఎన్నికల విధులకు ఎంపికైన కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 14 Apr 2024 02:39 IST

  ఎన్నికల విధుల శిక్షణకు 4వేల మంది గైర్హాజరు
 షోకాజ్‌ నోటీసులివ్వడంతో కారణాలు తెరపైకి 

శిక్షణకు హాజరైన ఎన్నికల సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌ : పోలింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులు ఉండట్లేదని ఎన్నికల విధులకు ఎంపికైన కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటి రెండు రోజుల్లో ఉద్యోగులకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలకు జరిగాయి. వాటికి సుమారు 4వేల మంది గైర్హాజరయ్యారు. ఎందుకు శిక్షణకు హాజరు కాలేదో కారణం చెప్పాలని ఇటీవల జిల్లా ఎన్నికల అధికారి (రోనాల్డ్‌రాస్‌) షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. చాలామంది సంబంధిత అధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు సగం మంది పోలింగ్‌ కేంద్రాల్లోని అసౌకర్యాలపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి పరిస్థితులు మెరుగుపడ్డాయని, భయం అక్కర్లేదని అలాంటి వారికి అధికారులు భరోసా కల్పిస్తూ నోటీసుకు వివరణ తీసుకుంటున్నారు.

పోలింగ్‌ కేంద్రాలపై ఫిర్యాదులు

పాతబస్తీలో యాఖుత్‌పుర, చాంద్రాయణగుట్ట, తదితర ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుద్దీపాలు, మరుగుదొడ్లు ఉండవని కొందరు మహిళా ఉద్యోగులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ః పాతబస్తీతోపాటు కొన్ని శివారు ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు గుంపులుగా ప్రవేశించి దుర్భాషలాడుతుంటారనే ఫిర్యాదులతో అధికారులు అయోమయంలో పడ్డారు.

క్రిమినల్‌ కేసులు తప్పవు

ఏపీఓ, పీఓ, ఓపీఓ స్థాయిల్లో శిక్షణకు హాజరవ్వని ఉద్యోగులకు నోటీసులిచ్చామని, సరైన కారణం లేని వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ ఆదేశించినట్లు యంత్రాంగం తెలిపింది.

తపాలా ఓటుపై కదలిక

గతంలో మాదిరి కాకుండా.. ఈసారి తపాలా ఓటు ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ వేగం పెంచింది. ఏప్రిల్‌ 15కు గడువు ముగుస్తుండటంతో.. ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు తపాలా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఫోన్‌ చేసి చెబుతున్నారు. ఓయూలో ఫారాలను అందిస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. మే 3 నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. హైదరాబాద్‌ పార్లమెంటు పరిధి ఓటర్లు నిజాం కాలేజీలో, సికింద్రాబాద్‌ పరిధిలోని ఓటర్లు కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని