logo

15న సాగర్‌లో అత్యవసర పంపింగ్‌

రాజధానికి తాగునీటి సమస్యను తలెత్తనీయమని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు.

Published : 14 Apr 2024 02:44 IST

నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్‌మెన్లపై చర్యలు

సమీక్షలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తదితరులు

 ఈనాడు, హైదరాబాద్‌ : రాజధానికి తాగునీటి సమస్యను తలెత్తనీయమని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌లో ఈ నెల 15 నుంచి అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ట్యాంకర్ల బుకింగ్‌లు తగ్గుతున్నాయని, డెలివరీ సమయాన్ని తగ్గించేందుకు అదనపు ట్యాంకర్లు, మినీ ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. తాగునీటి సరఫరా అంశాలపై ఆయన శనివారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ.సుదర్శన్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొందరు లైన్‌మెన్లు ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారనే అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు పడగా, శనివారం మరో ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు యంత్రాంగం తెలిపింది. జలమండలి రూపొందించిన మొబైల్‌ యాప్‌లో నీటి నాణ్యత, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు.

అదనపు జలాలు.. : జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దానకిశోర్‌ తెలిపారు. ముందస్తుగా మీరాలం, ఆసిఫ్‌నగర్‌ దగ్గరున్న ఫిల్టర్‌ బెడ్స్‌ వంద శాతం పనిచేసేలా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అదనపు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి స్థలాలను పరిశీలించాలన్నారు.

రంగంలోకి  మినీ ట్యాంకర్లు..

వినియోగదారుల నుంచి వస్తోన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 100ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2,500 లీటర్ల సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకుంటామన్నారు. శివారులో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడటంతో గతంలో రోజుకు 6 వేల ట్రిప్పుల సరఫరా ఉంటే.. ఇప్పుడు 5వేలు ఉంటున్నాయన్నారు.  

బస్తీల్లో పైపులైన్ల నిర్మాణం..

ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేస్తున్న బస్తీలను గుర్తించి.. వారి సమస్యకు పైపులైన్ల నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. జలమండలి పరిధిలో 13 లక్షలకుపైగా వినియోగదారులుండగా.. అందులో 31వేల మంది ట్యాంకర్లను బుక్‌ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాంటి వారు.. అవసరానికి తగ్గట్లు ఎక్కువ నీటిని పొందేలా కనెక్షన్‌ పరిమితిని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలో జలమండలి ఏర్పాటు చేసిన 101 చలివేంద్రాలకు ఆదరణ వస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని