logo

విహారం.. విడిది

కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన కారవాన్‌ టూరిజం నగరంలోనూ మొదలైంది.

Published : 14 Apr 2024 02:47 IST

 నగరంలో పెరుగుతున్న కారవాన్‌ టూరిజం
 ఫైవ్‌స్టార్‌ సదుపాయాలన్నీవాహనంలోనే
 అందులోనే ప్రయాణం, బస

కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన కారవాన్‌ టూరిజం నగరంలోనూ మొదలైంది. ఖాళీ సమయంలో ప్రకృతిలో గడపాలనుకునేవారికి, నగర శివార్లలో పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికి కొన్ని సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో కారవాన్‌లను అద్దెకిస్తున్నాయి. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలని ఉన్నా..ఆయా ప్రదేశాల్లో సరైన సదుపాయాలు లేక వెనకడుగు వేస్తుంటారు. పచ్చని ప్రదేశాలు, హోటళ్లు ఇతర సదుపాయాలు లేని చోటుకు సంకోచించకుండా వెళ్లేందుకు సకల సదుపాయాలు కల్పిస్తుండటం విశేషం.

వసతులు, ప్యాకేజీలు ఇవీ..

40 అడుగుల విలాసవంతమై కారవాన్‌లో ఏడుగురు వెళ్లేలా సీటింగ్‌ కెపాసిటీ, ఐదుగురికి సరిపోయేలా స్లీపింగ్‌ కెపాసిటీ ఉన్న వాహనాలను రోజులు, కిలోమీటర్ల లెక్కన అద్దెకిస్తున్నారు. విలాసవంతమైన బెడ్‌, రీక్లైనర్‌ కుర్చీలు, ఎల్పీజీ, ఎలక్ట్రిక్‌ స్టవ్‌లు, బాత్‌రూమ్‌తోపాటు అవుట్‌డోర్‌ షవర్‌, ఆటోమేటిక్‌ సోఫాబెడ్‌, ఫ్రీఫ్లో ఏసీ యూనిట్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ లైట్స్‌, ఆటోమేటిక్‌ టేబుల్‌, 90లీటర్ల సామర్థ్యంతో ఫ్రిడ్జ్‌, స్మార్ట్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా హోటల్‌ గదులు, ఆహారం కోసం వెతికే పనిలేకుండా సదుపాయాలు ఇందులో కల్పిస్తున్నారు.

నగరంలోని సంస్థలు కిలోమీటర్ల లెక్కన ప్యాకేజీలు అందిస్తున్నాయి. 300-350 కిలోమీటర్ల దూరంలో ఒక రోజు ప్రయాణానికి రూ.26,000 నుంచి 28,000, రెండు రోజులకు 500 కి.మీ.ల ప్రయాణానికి రోజుకు రూ.25,000, 600 కి.మీ.ల మూడు రోజుల ప్రయాణానికి రోజుకు రూ.23 వేల చొప్పున రుసుము నిర్దేశించాయి. కొన్ని సంస్థలు 80 కి.మీ.ల పరిధిలో 8 గంటలకు రూ.4,000, 200 కి.మీ.ల పరిధిలో 12గంటలకు రూ.6వేలు, ఇంకొన్ని సంస్థలు కి.మీ.కు రూ.35 చొప్పున వసూలు చేస్తున్నాయి. చేస్తున్నాయి. 12గంటలు అంటే ఉదయం 9 గంటలకు వాహనం తీసుకుంటే రాత్రి 9 వరకు ఒకరోజుగా నిర్ణయించి ధర ప్యాకేజీ నిర్ణయిస్తున్నారు.

అనువైన ప్రదేశాలెన్నో..

వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్టు కారవాన్‌లు అద్దెకిస్తున్న సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. నగరవాసులు 220 కి.మీ.ల దూరంలో ఉన్న లక్నవరం, చుట్టుపక్కల ఉన్న ఏటూరునాగారం అభయారణ్యం సందర్శించొచ్చు. ఇక్కడే లేక్‌ క్రాసింగ్‌, రోప్‌ కోర్సులు, కయాకింగ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. కారవాన్‌ టూరిజానికి నగరానికి వందకిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి అనువైన ప్రదేశం. నల్లమల అడవులు, శ్రీశైలం పుణ్యక్షేత్రం, అక్కడి ప్రాజెక్టులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులు సందర్శించొచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని