logo

ప్రొబయోటిక్స్‌ తయారీ.. పరిశోధనలు

సూక్ష్మజీవుల ఆధారిత పరిజ్ఞానంపై రీసెర్చ్‌ చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవసాయం.. ఆక్వాకల్చర్‌లో ప్రొబయోటిక్స్‌ తయారీ..పరిశోధనలు నిర్వహించనుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అబోడ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 14 Apr 2024 05:48 IST

ఓయూ, అబోడ్‌ బయోటెక్‌  ఒప్పందం

 ఈనాడు, హైదరాబాద్‌ : సూక్ష్మజీవుల ఆధారిత పరిజ్ఞానంపై రీసెర్చ్‌ చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవసాయం.. ఆక్వాకల్చర్‌లో ప్రొబయోటిక్స్‌ తయారీ..పరిశోధనలు నిర్వహించనుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అబోడ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం, చేపలు, రొయ్యల పెంపకంలో వాటి పెరుగుదలను క్రిమికీటకాలు అడ్డుకోకుండా,  సాంక్రమిక వ్యాధులు రాకుండా ప్రొబయోటిక్స్‌ తయారు చేయనున్నారు. ఓయూ మైక్రో బయాలజీ విభాగం ఆచార్యులు,   అబోడ్‌ బయోటిక్‌ శాస్త్రవేత్తలు కలిసి ప్రొబయోటిక్స్‌, సేంద్రియ ఎరువుల వినియోగంపై పంటపొలాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వాణిజ్యపరంగా వీరు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. తద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వ్యవసాయదారులు, ఆక్వాకల్చర్‌ సాగు చేస్తున్న వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.

విచ్చలవిడిగా రసాయనాలు...  

వాతావరణంలో మార్పులు, భూసారం తగ్గుతుండటంతో పంట దిగుబడులు పెరిగేందుకు  రైతులు విచ్చలవిడిగా నత్రజని, పొటాషియం వాడుతున్నారు. మరోవైపు తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. వీటివల్ల పంటల్లో యాంటీమైక్రోబియాల్‌ నిరోధకత, ప్రకృతిలో జీవవైవిధ్యం తగ్గుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను సృష్టించనున్నాయి. వీటిని పరిష్కరించేందుకు సూక్ష్మజీవుల ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. సూక్ష్మజీవ శాస్త్రాల్లో ఇటీవల వేగంగా వస్తున్న మార్పులు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన ప్రగతిని చూపిస్తున్నాయి.  

పరిశోధక విద్యార్థులకు కొత్త అవకాశాలు..

మానవ, జంతు ఆరోగ్యం, ఆక్వాకల్చర్‌, వ్యవసాయం కోసం సూక్ష్మజీవుల ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఇప్పటికే పేరొందిన అబోడ్‌ బయోటెక్‌తో ఒప్పందం ద్వారా ఓయూ మెక్రో బయాలజీ విభాగం విద్యార్థులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.  పీజీ, పరిశోధక విద్యార్థులు రైతుల వద్దకు వెళ్లి పంటలు, ఆక్వాకల్చర్‌ సాగులో అనుసరిస్తున్న కొత్త విధానాలను తెలుసుకోనున్నారు. వారి అవగాహన, పరిశోధనల వివరాలను అబోడ్‌ సంస్థకు వివరించడం ద్వారా జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుంటుంది. ఓయూ, అబోడ్‌ సంస్థలకు నోడల్‌ అధికారిగా సహ ఆచార్యులు డాక్టర్‌ హమిదాబీ వ్యవహరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని