logo

సదుపాయాలు కల్పిస్తేనే కాలుష్యానికి అడ్డుకట్ట

కాలుష్య నియంత్రణకు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.

Updated : 14 Apr 2024 05:57 IST

ఛార్జింగ్‌ స్టేషన్లు లేక విద్యుత్తు వాహనదారులకు ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌ : కాలుష్య నియంత్రణకు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలతో పాటు ఛార్జింగ్‌ స్టేషన్లను పెంచుకుంటూ పోతుంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కొరవడింది. ప్రస్తుతం నగరంలో 70 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండగా   అవసరమైన స్థాయిలో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కాలేదు.

ప్రతినెలా రోడ్డెక్కుతున్నవి 25 వేలు..  మహా నగరంలో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య 77 లక్షలకు చేరుకుంది. వీటికి తోడు ప్రతినెలా 25 వేలు కొత్తగా  రోడ్డెక్కుతున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. సీపీసీబీ నివేదికల ప్రకారం నగరాల్లో నమోదయ్యే కాలుష్యంలో 40 నుంచి 70 శాతం వాహనాల నుంచే విడుదలవుతున్నట్లు వెల్లడైంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మధూళి కణాల స్థాయికి చెక్‌ పెట్టాలంటే విద్యుతు వాహనాల వినియోగాన్ని పెంచేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా డీజిల్‌ ఇంధన ఆటోలు, పొగ వదిలే వాహనాలకు రెట్రోఫిట్టింగ్‌ (విద్యుత్తు వాహనాలుగా మార్పు) చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు కూడా ఇంధనంపై పెట్టేదానిలో 50 శాతం కావడంతో పెద్దగా భారం పడదని సూచిస్తున్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా... దేశవ్యాప్తంగా మొత్తం 12,146 ఎలక్ట్రిక్‌ వాహన ఛార్జింగ్‌ కేంద్రాలుండగా మహారాష్ట్రలో అత్యధికంగా 3,709 ఉన్నాయి.  కర్ణాటకలో 1041,. మన రాష్ట్రంలో మొత్తం 300కి పైగా ఛార్జింగ్‌ స్టేషన్లలో నగరంలో 190 ఉన్నాయి. విద్యుత్తు వాహనాల సంఖ్య పెరిగితే గాలిలో సూక్ష్మ ధూళికణాల స్థాయి తగ్గి వాయునాణ్యత మెరుగుపడుతుందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని