logo

పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే చర్యలు

పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేసేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని, అలాంటి సమాచారం 101కు అందించాలని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి సూచించారు.

Published : 15 Apr 2024 02:03 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేసేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని, అలాంటి సమాచారం 101కు అందించాలని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి సూచించారు. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ డే(జాతీయ అగ్నిమాపక దినం)ను పురస్కరించుకుని ఆదివారం వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అగ్నిమాపక అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో 39 అగ్నిమాపక శకటాలు, మరో 18 చిన్న శకటాలూ వచ్చి చేరనున్నాయని వెల్లడించారు. ఐదు ఫైర్‌ఫైటింగ్‌ రోబోలు రానున్నాయన్నారు. వరద బాధితులను రక్షించేందుకు మానవరహిత రిమోట్‌ లైఫ్‌ బాయ్స్‌ను సమకూర్చుకోనున్నట్లు చెప్పారు.  అవి 800 మీటర్ల దూరం వరకు వెళ్లి చెరువులు, వరదల్లో బాధితులను ఒడ్డుకు చేరుస్తాయని వివరించారు. 35 అంతస్తుల నుంచి బాధితులను రక్షించే ల్యాడర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. 15 మీటర్లకుపైగా ఎత్తుండే భవనాలకు ఎన్‌ఓసీ జారీ చేస్తామన్నారు. గతేడాది 51వేల అవగాహన కార్యక్రమాలు, 185 మాక్‌డ్రిల్స్‌ నిర్వహించినట్లు వివరించారు. రూ.కోట్లు ఖర్చుచేసి ఇళ్లు కట్టుకున్నా..రూ.10-15వేల విలువైన అగ్నిమాపక పరికరాల ఏర్పాటుకు వెనుకంజ వేస్తుంటారన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ నివారణ సాధనాలు ఇళ్లలో అమర్చుకోవాలని, ఇళ్లలో విద్యుత్‌ తీగల జీవితకాలం పదేళ్లేనని, తర్వాత మార్చుకోవాలని సూచించారు. వారంపాటు ఫైర్‌ సేఫ్టీవీక్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని