logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వారంతా ఒకేచోట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారాంతం కావడంతో శనివారం సాయంత్రం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు సరదాగా గడిపారు.

Published : 15 Apr 2024 02:21 IST

ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా

ప్రమాదానికి గురైన కారు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వారంతా ఒకేచోట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారాంతం కావడంతో శనివారం సాయంత్రం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు సరదాగా గడిపారు. తర్వాత 2గంటల సమయంలో తిరుగు ప్రయాణం కాగా ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌ను కారు ఢీకొని బోల్తాకొట్టడంతో ఇద్దరు అక్కడి…కక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. రాజేంద్రనగర్‌ ఎస్సై రవికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జగనాథపురానికి చెందిన గౌతంసాయి(24), ఆనంద్‌(31) ఇద్దరు స్నేహితులు. నగరంలోని నానక్‌రాంగూడలో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో సరదాగా గడపడానికి వీరితోపాటు పనిచేసే స్నేహితులు తనూజ, సూర్యతేజ, ప్రకాష్‌లతో కలిసి శనివారం సాయంత్రం కారులో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి వరకు గడిపి రాత్రి 2గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. సూర్యతేజకు చెందిన కారు కావడంతో అతడే డ్రైవింగ్‌ చేస్తున్నాడు. గౌతంసాయి, ఆనంద్‌, ప్రకాష్‌లు వెనక సీట్లో కూర్చున్నారు. బాహ్యవలయ రహదారిపై గచ్చిబౌలి వైపు వేగంగా వస్తున్న సమయంలో కారు రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని ఎగ్జిట్‌ నంబర్‌ 17 సమీపంలో డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గౌతంసాయి, ఆనంద్‌లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని