logo

ఉల్లి ధరహాసం.. రైతన్న ఆనందం

వరుసగా మూడేళ్లుగా నష్టాలతో కుదేలైన ఉల్లి రైతులకు ఈసారి కలిసొచ్చింది. ఆశించిన దానికంటే అధిక ధరలతో లాభాల పంట పండింది. విపణిలో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఊరట కలిగింది.

Published : 15 Apr 2024 02:26 IST

బస్తాల్లో నింపిన దిగుబడులు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: వరుసగా మూడేళ్లుగా నష్టాలతో కుదేలైన ఉల్లి రైతులకు ఈసారి కలిసొచ్చింది. ఆశించిన దానికంటే అధిక ధరలతో లాభాల పంట పండింది. విపణిలో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఊరట కలిగింది. జిల్లాలో తాండూరు, పెద్దేముల్‌, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట, వికారాబాద్‌, పూడూరు, కుల్కచర్ల, పరిగి, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట, బొంరాస్‌పేటలో 2వేలకుపైగా ఎకరాల్లో ఉల్లి పండిస్తారు. అత్యధికంగా తాండూరు మండలం ఐనెల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, కోటబాస్పల్లి, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, బెల్కటూరు, కరణ్‌కోట, చంద్రవంచ, కొత్లాపూర్‌, సిరిగిరిపేట, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌, పర్వతాపూర్‌, చెంగోల్‌, చింతామణిపట్నం, వీర్‌శెట్టిపల్లి, ఖాంజాపూర్‌, బిజ్వార్‌, అంతారం తండాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది అక్టోబరు, నవంబరులో సాగు చేసిన ఉల్లి చేతికొచ్చింది. దీంతో రెండుమూడు వారాలుగా రైతులు కోతలు పూర్తి చేసి మలక్‌పేటలోని విపణికి తరలిస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 100 నుంచి 110 క్వింటాళ్ల దిగుబడులు రావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు.

క్వింటా రూ.1,600కు పైగా..

ఉల్లి ధరలు గతేడాది క్వింటా రూ.400 నుంచి రూ.800 పలికింది. దీంతో పెట్టుబడికి గిట్టుబాటు కాకపోవడంతో రైతుల శ్రమ దండగైంది. కూలీల చెల్లింపులు, రవాణా ఖర్చులు మీద పడ్డాయని ఆవేదన చెందారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొని నష్టపోయారు. తాజాగా ఈ సారి ధరలు అమాంతం పెరగడంతో  ఉపశమనం లభించింది. మలక్‌పేట విపణిలో క్వింటాలు ధర రూ.1,600 నుంచి రూ.2,000 పలుకుతోంది. దీంతో ఎకరాకు రూ.50వేల పెట్టుబడి ఖర్చులు పోను రైతులకు రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది.


ఎకరాకు రూ.లక్ష మిగిలింది
- రఘునాయక్‌, మిట్టబాస్పల్లి

రెండు ఎకరాల్లో పండిస్తే ఎకరాకు వంద క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మలక్‌పేట విపణిలో క్వింటా రూ.1,600కు విక్రయించా. దుక్కులు దున్నేందుకు, ట్రాక్టర్‌ అద్దె, నారు, కూలీలు, నీరు పారించేందుకు, కోతలు, రవాణా ఖర్చులకు ఎకరాకు రూ.50వేల దాకా ఖర్చైంది. ఇవి పోనూ రూ.లక్ష గిట్టుబాటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని