logo

ఆరు గ్యారంటీలు 90శాతం పూర్తి: కాంగ్రెస్‌

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే 90శాతం పూర్తిచేశామని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Updated : 15 Apr 2024 04:42 IST

పరిగిలో బైక్‌ర్యాలీలో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి, పరిగి గ్రామీణ. న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే 90శాతం పూర్తిచేశామని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి, పరిగి మండలం మిట్టకోడూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డితో కలిసి పర్యటించారు. పరిగిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో రుణమాఫీ కూడా అమలవుతుందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ రూ.7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారని, పనికిరాని ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. తాము మంజూరు చేయించుకున్న సాగునీటి ప్రాజెక్టులను అన్యాయంగా రద్దు చేశారని చెప్పారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ పాపం భారాసదేనని దుయ్యబట్టారు. రంజిత్‌రెడ్డి పలు పార్టీలు మారారని చేవెళ్ల సభలో మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారని, అయితే ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన విషయాన్ని విస్మరించారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు అన్యాయం చేశారని, తట్టెడు మట్టికూడా తీయకుండా, ప్రాజెక్టులు కట్టకుండా విమర్శించడం తగదన్నారు. రంజిత్‌రెడ్డిని ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఆశీర్వదించాలని కోరారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌ వైపే చూస్తోందని, పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు, ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, మండల  అధ్యక్షుడు పరశురాంరెడ్డి, నాయకులు కడ్మూరు ఆనందం, శ్రీనివాస్‌, శివకుమార్‌, పర్వత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

నేడు పేటలో జనజాతర సభ

మహబూబ్‌నగర్‌: పూర్వ పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడి రెండు స్థానాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా తన నియోజకవర్గం కొడంగల్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని సీఎం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసమే భాజపాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ నెల 8వ తేదీన కొడంగల్‌లో ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొడంగల్‌ నియోజకవర్గంలోనే కనీసం 50 వేల మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం జన జాతర పేరుతో నారాయణపేటలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మెజార్టీ సాధించేలా నియోజకవర్గాల కేంద్రాల్లో సీఎం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని