logo

భత్యం విడుదల.. చిన్నారులకు భరోసా

బడి వయస్సు పిల్లలంతా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి. దివ్యాంగులు మాత్రం రోజు బడికెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ రకాల ‘భత్యం’ అందిస్తోంది.

Published : 15 Apr 2024 02:31 IST

దుద్యాలలో దివ్యాంగులకు ఫిజియోథెరపీ

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: బడి వయస్సు పిల్లలంతా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి. దివ్యాంగులు మాత్రం రోజు బడికెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ రకాల ‘భత్యం’ అందిస్తోంది. 2023-24కు సంబంధించిన జూన్‌ నుంచి మార్చి వరకు అందాల్సిన భత్యం విడుదల చేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగుల్లో 21 రకాల ప్రత్యేక అవసరాలున్న బాలబాలికలకు విద్యాబుద్దులు నేర్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘సమ్మిళిత విద్య’ను అమలు చేస్తున్నారు. ఇందుకోసం మండలస్థాయిలో రిసోర్స్‌పర్సన్‌లను (ఆర్‌పీ) నియమించారు. పీఎంశ్రీ పథకంలో ఎంపికైన బడులతో పాటు పాఠశాలకు వస్తున్న వారిలో అర్హులైన 398 మందికి నాలుగు రకాల భత్యం ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ చదువుకునేలా...: వైకల్య లోపం (దివ్యాంగ)తో బడి వయస్సు పిల్లలు చదువులకు దూరం కావద్దనేది విద్యాశాఖ లక్ష్యం. ఇందుకోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను నాలుగు విభాగాలుగా గుర్తించి భత్యాలను అందజేస్తున్నారు. అంధత్వంతో బాధపడే వారికే రీడింగ్‌ అలవెన్స్‌ ఇస్తున్నారు. మిగిలిన విద్యార్థుల మాదిరిగా నడవలేక వాహనంపై వచ్చే వారికి, సహాయకులకు ప్రతి నెలా అందిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 398 మంది విద్యార్థులకు భత్యాల కింద రూ.13,07,680 నిధులు మంజూరు చేశారు. ప్రత్యేక అవసరాలను గుర్తించిన ప్రభుత్వం అందులో ప్రధానంగా రవాణా, ఎస్కార్ట్‌, బాలికలకు ఉపకార వేతనాలతో పాటుగా దృష్టిలోపం కలిగిన బాలికలు, సహాయకులకు అలవెన్స్‌ మంజూరు చేస్తున్నారు. బడి ఈడు పిల్లలంతా పాఠశాల లేదా ఇతర ప్రత్యామ్నాయ వనరుల్లో చదువుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది.

ఖాతాల్లో జమ చేస్తున్నాం: రేణుకాదేవి, డీఈవో

ఈ ఏడాదికి¨ సంబంధించిన భత్యం ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఎన్నికల కోడ్‌ కారణంగా కొందరికి ఆలస్యమైంది. నిధులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితుల కారణంగా దివ్యాంగులు చదువుకు దూరం కావద్దనేది ప్రభుత్వ లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని