logo

పథకాల నిర్వహణ.. అధికారుల కార్యాచరణ

తాండూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాగ్నా నది ఒడ్డున ఏర్పాటు చేసిన రెండు నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటిని వినియోగంలోకి తీసుకువస్తే పట్టణ ప్రజలకు వేసవిలో ఎద్దడి లేకుండా నీటిని సరఫరా చేయొచ్చు.

Updated : 15 Apr 2024 06:20 IST

నదిపై నిర్మించిన ఆనకట్టలో నిండుగా నీరు

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాగ్నా నది ఒడ్డున ఏర్పాటు చేసిన రెండు నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటిని వినియోగంలోకి తీసుకువస్తే పట్టణ ప్రజలకు వేసవిలో ఎద్దడి లేకుండా నీటిని సరఫరా చేయొచ్చు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఐదు దశాబ్దాల కిందట మొదటి పంప్‌హౌస్‌ ఏర్పాటు చేశారు. నదిలో మూడు ఇన్‌ఫిల్టరేషన్‌ బావులను నిర్మించారు. ప్రధాన బావిపైనే పంప్‌హౌస్‌ నిర్మించారు. ఇందులో 30 అశ్విక శక్తిగల రెండు మోటార్లను బిగించి, వీటికి అనుసంధానంగా ప్రత్యేక పైపులైన్‌ ఏర్పాటు చేశారు. పట్టణంలో నాలుగు ట్యాంకులు నిర్మించి, రెండు పూటలా నీటిని సరఫరా చేశారు.

2007లో మరోటి నిర్మాణం

పట్టణ విస్తీర్ణం పెరిగి, 2007 నాటికి జనాభా 50 వేలకు చేరింది. తాగునీటి అవసరం 6ఎంఎల్‌డీ( మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే)కి చేరింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కాగ్నా పక్కనే ప్రభుత్వం మరో పంప్‌హౌస్‌ను నిర్మించింది. నదిలోనే రెండు ఇన్‌ఫిల్టరేషన్‌ బావులతో పాటు, మరో ప్రధాన బావిని నిర్మించారు. అంబేడ్కర్‌ పార్కు, లారీ పార్కింగ్‌ వద్ద ఒక్కో ట్యాంకు నిర్మించారు. మొత్తం పథకానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశారు. పంప్‌హౌస్‌ల నుంచి వచ్చే నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసి పట్టణంలోని అన్ని వార్డులకు సరఫరా చేయడంతో, ఎద్దడి తలెత్తలేదు. నదిలో ప్రవాహం తగ్గి బావులు అడుగంటినపుడు కోట్‌పల్లి జలాశయం నుంచి నీటిని బావుల్లో నిల్వ చేసి సరఫరా చేశారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని

పెరిగే జనాభా, పట్టణ విస్తరణను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ఇంజినీర్లు ముందస్తు ఆలోచన చేశారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో కాగ్నాలోకి వచ్చే వరద దిగువకు వృథాగా పోకుండా ఉండేందుకు ఆనకట్ట నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆమేరకు అప్పటి ప్రభుత్వం రూ.8.53 కోట్లు మంజూరు చేసింది. 2016లో పాత పంప్‌హౌస్‌ దిగువన నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించారు. కిలోమీటరు పొడవునా 0.9 టీఎంసీ నీరు నిల్వ ఉండడంతో పంప్‌హౌస్‌ వద్ద జలకళ ఉట్టిపడింది. పెరిగిన జనాభాకు తగ్గట్టు 8 ఎంఎల్‌డీ తాగునీటి సరఫరా మెరుగ్గా జరిగింది.


ఐదేళ్ల నుంచి వృథాగా..

గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ నీటి సరఫరా ప్రారంభం కాగానే 2019 నుంచి రెండు పంప్‌హౌస్‌లను వినియోగించడం లేదు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన రెండు ట్యాంకులకు తోడు, పాత ఆరు ట్యాంకుల ద్వారా స్థానికులకు నీటిని సరఫరా చేస్తున్నారు పట్టణంలో అధికారిక జనాభా 71 వేలు. అనధికారిక లెక్కల ప్రకారం లక్షకు పైగా ఉంది. రోజువారీగా 12 ఎంఎల్‌డీ నీటి సరఫరా కావాలి. ప్రస్తుతం 9 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా జరుగుతోంది. దీంతో పట్టణంలోని చాలా కాలనీలు ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిలో నది ఒడ్డున ఉన్న పంప్‌హౌస్‌లను వినియోగంలోకి తీసుకు వస్తే తాగునీటిని సరఫరా చేయవచ్చు.


మోటార్లకు మరమ్మతు చేయిస్తున్నాం
- ఖాజాహుసేన్‌, డీఈఈ

వేసవి నేపథ్యంలో పంప్‌హౌస్‌లను వినియోగంలోకి తీసుకు రావాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు మోటార్లను మరమ్మతు చేయిస్తున్నాం. పది రోజుల్లో మోటార్లను బిగించి పట్టణ వాసులకు ఎద్దడి లేకుండా నీటిని సరఫరా చేస్తాం. తర్వాత మరో పంప్‌హౌస్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని